ప్రకాశం జిల్లా కందుకూరులో రోడ్డుపై పొగాకు బేళ్లను తగలబెట్టి నిరసన తెలుపుతున్న రైతులు
ప్రకాశం జిల్లాలో బేళ్లు తగులబెట్టి నిరసన
చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం
వేలం కేంద్రాల్లో వ్యాపారుల తీరుపైనా కన్నెర్ర
ధరలు లేక భారీగా నష్టపోతున్నామంటూ ఆవేదన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు వేలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా మూడు మిలియన్ కేజీల ఉత్పత్తులూ ఇప్పటి వరకు కొనలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన గిట్టుబాటు ధరలు లేక ఆవేదనలో ఉన్న రైతులు వేలం ప్రక్రియ ఆలస్యంతో మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రోడ్లపై పొగాకు బేళ్లను పోసి తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్‌లు లేవనే సాకుతో వ్యాపారులు, పొగాకు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండపి, టంగుటూరు, పొదిలి, కనిగిరి, వెల్లంపల్లి, ఒంగోలు 1 వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. చంద్రబాబు పాలనపై కన్నెర్ర చేశారు. రెండు నెలలుగా ధరలు లేక నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు ఇదే విధంగా ఉంటే బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.
టీడీపీ నేత ఓవరాక్షన్
ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం కందుకూరులోని
రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టీడీపీ నేత, రైతు నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే యత్నం చేశారు.
స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా.. రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు అండగా నిలబడకుండా వ్యాపారులకు వంతపాడడంపై మండిపడ్డారు. దీంతో రైతులు కూడా రమణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు వేలంలో పాల్గొని పొగాకు కొనేలా చూడాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు.


