ప్రాణం తీసిన స్నానం సరదా | Three tribal girls die after drowning in waterfall | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్నానం సరదా

Apr 10 2026 5:26 AM | Updated on Apr 10 2026 5:26 AM

Three tribal girls die after drowning in waterfall

ఘటన జరిగిన ములగుమ్మి జలపాతం , మృతిచెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారి (ఫైల్‌)

జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన యువతుల మృతి

మరో యువతికి తీవ్ర గాయాలు

సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జల­పాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువ­తు­లు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యా­యి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువా­రం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువ­తు­లు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ముల­గుమ్మి జలపా­తం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. 

గ్రామంలో ఇటుకల పండుగ కావ­డంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపా­రు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జల­పాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డు­న పెద్ద బండరాయిపై నిల్చుని సెల్‌ఫో­న్‌లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాద­వశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటి­లో మునిగి మృతిచెందారు. వా­రు ముని­గిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయా­ల­య్యా­యి. 

ఈ విషయం తెలుసు­కున్న జంబువలస గ్రామా­నికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరు­కుని ముగ్గురి మృతదే­హాలను బయ­టకు తీశా­రు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్‌సీకి తర­లించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల­లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా­సింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్‌ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదు­వుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.

వైఎస్‌ జగన్‌ సంతాపం 
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్‌ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెంద­డం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వ­రగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించా­రు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కా­కుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యల­ను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement