ఆశ కార్యకర్తపై హత్యాచారం

Three Men molested on Aasha Worker - Sakshi

గుంటూరు(మాచర్ల): ఆశ కార్యకర్తపై ముగ్గురు లైంగికదాడి చేసి తర్వాత హత్య చేసిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన మహిళ (46) కొప్పునూరు, నాగులవరం పంచాయతీ పరిధిలోని అనుపు చెంచుకాలనీ, బీకెవీ పాలెం చెంచుకాలనీలలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. లస్కర్‌కు ఆమె రెండో భార్య. లస్కర్‌ మొదటి భార్య సాయితో గ్రామ శివారులోని పొలంలో ఉంటున్నాడు. ఈ నెల 16న సాయంత్రం లస్కర్‌ తన రెండో భార్యతో మాట్లాడి వెళ్లాడు. 17న ఉదయం ఇంటికి రాగా ఆమె కనిపించలేదు. పక్క ఇంటిలో ఉంటున్న ఆమె తండ్రి లాలు, లస్కర్‌ కలిసి గ్రామంలో ఆమె కోసం వెతికారు.   

ముత్తయ్య సమాచారంతో బీకేవీపాలెంకు.. 
గ్రామానికి చెందిన మండ్లి ముత్తయ్యను తన భార్య కనిపించిందా అని లస్కర్‌ అడిగాడు. దీనికి అతను రాత్రి 9 గంటలకు తన సెల్‌ఫోన్‌ పోయిందని ఆమె తమ ఇంటివైపు వచ్చిందని, ఆ సమయంలో ఇక్కడే ఉన్న బీకేవీ పాలెంకు చెందిన సావిటి చిన్న అంజి, శీలం అంజి, శీలం భైస్వామి తమ గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి పోయిన సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉందో కనిపెడతాడని చెప్పారని, దీంతో ఆమె వారితోపాటు ఆ గ్రామానికి వెళ్లిందని చెప్పాడు. లస్కర్‌ బీకేవీపాలెంలోని వెంకన్న వద్దకు వెళ్లి ఆరా తీశాడు. తన దగ్గరకు వచ్చిన మాట నిజమేనని, అయితే సెల్‌ స్విచ్‌ఆఫ్‌లో ఉందని, తరువాత రోజు వస్తే చూస్తానని చెప్పడంతో ఆమె ఆ ముగ్గురితో కలిసి వెళ్లిపోయిందని వివరించాడు.  
నేరం అంగీకరించిన నిందితులు 
దీంతో అనుమానమొచ్చిన లస్కర్‌తోపాటు గ్రామస్తులు  సావిటి చిన అంజి, శీలం అంజిలను గట్టిగా ప్రశ్నించారు. ముగ్గురం లైంగికదాడి చేశామని, ఆ సమయంలో ఆమె గొడవ చేయటంతో శీలం అంజి రాయితో తల మీద కొట్టాడని చెప్పారు. తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందిందని వివరించారు. రోడ్డు పక్కన రెండు బండరాళ్ల మధ్య బాధితురాలి మృతదేహాన్ని ఉంచి తాటాకులు కప్పామని వెల్లడించారు. ఘటనాస్థలాన్ని చూపించారు. లస్కర్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ముగ్గురు నిందితులు చిన అంజి, అంజి, భైస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  మృతురాలికి ఆరుగురు కుమార్తెలు. ముగ్గురికి వివాహమైంది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

గతంలోనూ నేరాలు 
సావిటి చిన అంజి, శీలం అంజికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. 2020 జనవరిలో వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు గ్రామానికి చెందిన మహిళ హత్యాచారం కేసులో వీరు నిందితులు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top