ఉగ్రపోరులో జవాన్‌ వీర మరణం

Telugu jawan Deceased In jammu Kashmir Encounter - Sakshi

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్‌రెడ్డి కన్నుమూత

నేడు గుంటూరు జిల్లా దరివాద కొత్తపాలెంలో అంత్యక్రియలు 

సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర సంతాపం

వీర జవాన్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

సాక్షి, బాపట్ల టౌన్‌/సాక్షి, అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి (23) అమరుడయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరజవాన్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 

తన తండ్రి ఆశయానికి అనుగుణంగా..
కౌలు రైతుగా జీవనం సాగిస్తున్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన జశ్వంత్‌రెడ్డి 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తన చిన్న తమ్ముడు విశ్వంత్‌రెడ్డిని ఐఏఎస్‌ అధికారిని చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఒక కోచింగ్‌ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. బుధవారం సాయంత్రం చివరిసారిగా తమతో మాట్లాడుతూ.. ‘నేను అడవుల్లో ఉన్నాను.. నా ఫోన్‌ మా సార్‌ దగ్గర ఉంది.. వేరే సార్‌ ఫోన్‌ నుంచి మాట్లాడుతున్నా.. నాన్నా మీరంతా బాగున్నారా.. పూలతోటలు ఎలా ఉన్నాయి.. ఒక్కసారి ఫోన్‌ అమ్మకివ్వు... అమ్మా నేను ఈరోజు కూడా అడవుల్లోనే ఉన్నాను. రేపు, ఎల్లుండి కూడా ఇక్కడే ఉండాలి.. రూమ్‌కు వెళ్లాక ఫోన్‌ చేస్తాను.. మీరంతా బాగున్నారా’ అని అన్నాడని, ఇంతలోనే తమ బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

నేడు అంత్యక్రియలు
వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో తరలించారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం దరివాద కొత్తపాలెం తీసుకొస్తారు. శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి
వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ, తదితరులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు జశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. 

జవాన్‌ చిరస్మరణీయుడు: సీఎం 
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో మృతి చెందిన వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణకు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని, ఆయన త్యాగం నిరుపమానమైనది అని కొనియాడారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వీర జవాన్‌ సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ వీర జవాన్‌ మరణ వార్త తెలియగానే వెంటనే స్పందించారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top