
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.
టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా చేపడతామని చెప్పి.. ఆన్‌లైన్ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.
ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.
ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్‌లైన్ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్‌లైన్ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి.