లోపాలపై విద్యార్థులు ప్రశ్నిస్తే టీచర్లపై సస్పెన్షన్ వేటు
ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులే లక్ష్యంగా వేధింపులు
గతేడాది దాదాపు 22 మంది టీచర్లపై ఇవే తరహా చర్యలు
సర్కారు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు కత్తికట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. చిన్నచిన్న విషయాలకు టీచర్లను బలిచేస్తోంది. ఇలా దాదాపు 22 మంది ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయ లోకంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ లోపాలను సరిచేయకుండా వేధింపులకు దిగడం చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని మండిపడుతున్నారు.
సాక్షి, అమరావతి: విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తే దానికి టీచర్లను బాధ్యులుగా చేసి వేధింపులకు గురిచేయడంతోపాటు సస్పెన్షన్ బహుమతిగా ఇస్తోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీసులు ఇస్తోంది. బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరినా నేరమే అంటోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీలిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను టార్గెట్ చేసి వేధిస్తోంది.
గత ప్రభుత్వంలో నాణ్యంగా మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించింది. స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడిన ఏజెన్సీల ద్వారా వారానికి 16 రకాల పదార్థాలతో పౌష్టికాహారం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతకు తిలోదకాలిచ్చింది. దీంతో పలుచోట్ల విద్యార్థులే రోడ్డెక్కి నినాదాలు చేయడం, కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో ఇందుకు కారణం ఉపాధ్యాయులేనని ప్రభుత్వం కక్షగట్టింది.
మంచి భోజనం పెట్టమంటే సస్పెన్షన్ అస్త్రం
» విశాఖ జిల్లా చిన్నగదిలి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని పాఠశాల విద్యార్థులు కంచాలతో రోడ్డెక్కారు. పురుగులు పట్టిన అన్నం, నాణ్యతలేని కూరలు అందిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్ 8న కలెక్టర్ కార్యాలయం తలుపుతట్టారు. దీనికి ఇక్కడి ఉపాధ్యాయులే కారణమని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
» డిసెంబర్ 13న వైఎస్సార్ కడప జిల్లా తాండూరు మండలం ఎదులవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడా ఉపాధ్యాయులను నిందితులుగా చేశారు. భోజనం బాగోలేదని ఉపాధ్యాయులు హెచ్చరించినా వంట ఏజెన్సీకి స్థానిక టీడీపీ నాయకులు అండగా నిలిచి ఉపాధ్యాయులనే బెదిరించారు. తీరా నష్టం జరిగాక టీచర్లనే బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు.
» ఈ ఏడాది మార్చి 10న ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల(ఎంపీఎస్)లో భోజనం సరిగా పెట్టడం లేదని, వంట దారుణంగా ఉందని విద్యార్థులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు మంచి భోజనం పెట్టాలని వంట ఏజెన్సీని అడిగిన పాపానికి హెచ్‌ఎంను సస్పెండ్ చేశారు.
» మార్చి 17న విజయవాడ సమీపంలోని గొల్లపూడి ఎంపీపీ స్కూల్లో పెట్టే భోజనం బాగోలేదని, చిక్కీల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలను మీరే రెచ్చగొడుతున్నారంటూ హెచ్‌ఎంకు నోటీసులిచ్చారు.
» నెల్లూరు జిల్లా కోడూరు ఎంపీపీఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు.. విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీ చేసిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని డీఈవోకు మెమోరాండం ఇచ్చారు. ఇదే నేరమన్నట్టు ఆయన్ను సస్పెండ్ చేశారు.
» గుంటూరు నగరంలోని మున్సిపల్ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. ఆ సమయంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం విధుల్లో లేరన్న కారణం చూపి విధుల నుంచి తప్పించారు. వాస్తవానికి ఆమె కొన్ని రోజులుగా మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఇది అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే మెప్పు కోసం ఆమెపై చర్యలు తీసుకోవడం కొసమెరుపు.
» సీఎం చంద్రబాబు జనాభా పెంపునకు నడుం బిగించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని మార్కాపురం మండలం తాళ్లూరు ఎంపీపీఎస్‌కు చెందిన ఓ టీచర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వెంటనే అధికారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుని ‘సీఎంనే ప్రశ్నిస్తావా’.. అంటూ సస్పెండ్ చేశారు. ఈ ఘటనల్లో బాధిత ఉపాధ్యాయులంతా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే. కళ్లముందు జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకు ముగిసిన విద్యా సంవత్సరంలో 22 మంది ఉపాధ్యాయులపై వేటు వేయడం గమనార్హం.


