
రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలకు అవకాశం
జిల్లాకు సగటున 500 మంది ఎస్‌ఏల మిగులు
మిగులు టీచర్లను డీఈవో పూల్‌కు అప్పగించాలని నిర్ణయం
తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ఆవేదన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. అర్హులైనవారికి పదోన్నతులు కల్పించి, అనంతరం బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ పూర్తికావడంతో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ నాటికి బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులు, షెడ్యూల్ విడుదల చేసి 31వ తేదీకి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ను విడుదల చేసిన విద్యాశాఖ... ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ముసాయిదాను యథాతథంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్దీకరణ చట్టం–2025’గా విడుదల చేసింది. దీనిపై ఉపాధ్యాయులు పలు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
అయినా ఈ చట్టం ప్రకారమే ప్రస్తుత బదిలీలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. జీవో నంబర్ 117 రద్దు మార్గదర్శకాలకు భిన్నంగా పాఠశాలలను 9 రకాలుగా విభజించడం, 3 నుంచి 5 తరగతులకు సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు చేయడంతో అన్ని జిల్లాల్లోనూ భారీగా స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ) మిగులుతున్నారు.
5,152 మందికి ఎస్‌ఏలుగా పదోన్నతి
ఉన్నత పాఠశాలలో 75 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే హెచ్‌ఎం పోస్టు కేటాయించారు. విద్యార్థుల సంఖ్య 75 మంది కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ అయితే అక్కడా హెచ్‌ఎం పోస్ట్ కేటాయించారు. మొత్తం 5,152 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వనుండగా, వీటిలో 60 శాతం మున్సిపల్ పాఠశాలల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
1,331 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 294 హైసూ్కల్ ప్లస్ పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీపై విద్యాశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 779 ప్రాథమికోన్నత పాఠశాలలను హైసూ్కల్స్‌గా అప్‌గ్రేడ్ చేసినట్టు తెలుస్తోంది.
హేతుబద్ధీకరణ ప్రకారం బదిలీలు
» పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రకారం ఒక పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను రద్దు (షిఫ్ట్) చేస్తారు. తప్పనిసరి బదిలీలో ఉన్నవారిని మొదట బదిలీ చేస్తారు. ఈ రెండు కేసులు లేకపోతే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో అత్యంత జూనియర్‌ను బదిలీ చేస్తారు.
» నూతన చట్ట ప్రకారం 8, 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి తప్పనిసరి బదిలీ ఉంటుంది. వీరు సొంత మేనేజ్‌మెంట్‌కి బదిలీ అవుతారు.
» సీనియర్ బదిలీకి అంగీకరిస్తే వారికి రేషనలైజేషన్ ప్రకారం ఇచ్చే 5 పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయులు గతంలో పనిచేసిన పాఠశాలకు సంబంధించిన బదిలీ పాయింట్లు కోరితే వారికి కూడా 5 పాయింట్లు ఇవ్వరు.
» ప్రత్యేక అవసరాలు గల టీచర్లకు, రెండేళ్ల సర్వీసు ఉన్నవారికి బదిలీలు ఉండవని తెలుస్తోంది.
» పాఠశాలలో మిగులు ఉన్న టీచర్లలో డిజేబుల్డ్, రిటైర్‌మెంట్‌కు రెండేళ్ల సమయం ఉన్నవారిని బదిలీ చేయరు.
» తప్పనిసరి బదిలీల్లో ఉన్న దివ్యాంగులను కోర్టు తీర్పు మేరకు లేదా వారు కోరుకుంటే బదిలీ చేస్తారు.
» తొలుత ప్రధాన ఉపాధ్యాయులను బదిలీలు చేస్తారు. అనంతరం హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించి బదిలీ చేయనున్నారు.
జిల్లాకు సగటున 500 ఎస్‌ఏ పోస్టుల మిగులు
సబ్జెక్టు టీచర్ల విధానం రద్దు, యూపీ స్కూళ్లలో ఎస్‌ఏ పోస్టుల తొలగింపు, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి పెంపు వంటి చర్యలతో ప్రతి జిల్లాలో సగటున 700 నుంచి 1,000 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు ఏర్పడుతోంది. వీరిలో కొందరిని ప్రాథమిక పాఠశాలల్లో అవసరమైన చోట హెచ్‌ఎంలుగా నియమిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ ఇంకా జిల్లాకు 500 చొప్పున మిగులుగా మారుతున్నట్టు అంచనా.
వీరిని ఆయా జిల్లాల్లో డీఈవో పూల్‌లో ఉంచనున్నట్టు తెలుస్తోంది. అంటే ఎలాంటి విధులు లేకుండా గాల్లో ఉంచినట్టే అవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఎనిమిది నెలలుగా ప్రతి వారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో నిర్వహించిన సమావేశాల్లో గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించి, రిజిస్టర్డ్ సంఘాలను విస్మరించారు.
గుర్తింపు సంఘాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీల షెడ్యూల్ రాగానే తమకు జరిగే అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించాలని ఉపాధ్యాయ సంఘాలు భావించగా, కోర్టుకు వేసవి సెలవులు పూర్తయ్యే లోగానే బదిలీ ప్రక్రియ పూర్తిచేసేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.