
ఈ వయస్సులో ఎక్కడికి వెళ్లి జీవించాలి
వృద్ధ దంపతుల ఆవేదన
అన్నమయ్య: గత ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేశాము.. మా అంగడిపైనా టీడీపీ జెండాలే ఉన్నాయి.. అయినా సరే టీటీడీ అధికారులు, పోలీసులు మా అంగడిని ఖాళీ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. వీరికి పరోక్షంగా టీడీపీ నాయకులే వత్తాసు పలుకుతున్నారు. ఈ వయస్సులో మేము ఎక్కడికి వెళ్లి జీవించాలి అంటూ మండలంలోని తరిగొండ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎన్. అబ్దుల్ రౌఫ్, ఎన్. గులాబ్ జాన్ దంపతులు గ్రామంలోని రామాపురం క్రాస్ వద్ద రోడ్డుపక్కనే బజ్జీల దుకాణం నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఇదే వీరికి జీవనాధారం.
బజ్జీల దుకాణం పైన రెండు టీడీపీ జెండాలను కట్టుకొని వ్యాపారం చేసుకొంటున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వీరిపై కక్ష గట్టి వేధింపులకు దిగారు. వీరు దుకాణం నిర్వహిస్తున్న స్థలం టీటీడీకి చెందింది. ఏళ్ల తరబడి టీటీడీ అధికారులకు వీరు అద్దెలు చెల్లిస్తూ రసీదులు పొందారు. వీరితో పాటు ఇంకా పలు దుకాణాలను ఈ స్థలాల్లో పలువురు నిర్వహించుకొంటున్నారు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తమ దుకాణం తొలగించాల్సిందిగా టీటీడీ అధికారులు, పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.
సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పటికే మూడు చోట్ల దుకాణం పెట్టుకోగా అన్ని చోట్ల ఖాళీ చేయించారని వారు వాపోయారు. కనీసం ఈ స్థలంలోనైనా దుకాణం నిర్వహించుకొందామంటే టీడీపీ నాయకులు అధికారులను, పోలీసులను తమపైకి పంపించి వేధిస్తున్నారని ఆవేదన చెందారు. మాతో పాటు ఇంకా పలువురు ఇక్కడ దుకాణాలు నిర్వహించుకొంటున్నా అఽధికారులు వారిని వదిలిపెట్టి మమ్మల్నే ఖాళీ చేయమంటూ వేధిస్తుండడం దారుణమన్నారు. టీటీడికి చెల్లించిన రసీదులు చూపించినా కనికరించడం లేదని వారు పేర్కొన్నారు. తమకు అధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.