
తహసీల్దార్, ఎస్‌ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి హెచ్చరిక
తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు
టిప్పర్లు, పొక్లెయిన్లను సీజ్ చేసి నందుకు తట్టాబుట్టా సర్దుకోవాలంటూ వార్నింగ్
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన
ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిపై దాడికి యత్నం
పాలసముద్రం: అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు, పొక్లెయిన్‌ను తహసీల్దార్, ఎస్‌ఐ అడ్డుకుని వాటిని సీజ్ చేసినందుకు వారిని మండలంలో లేకుండా చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు ఒకరు బెదిరించాడు. పైగా.. ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు.
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..పాలసముద్రం మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు మూడు, నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ అరుణకుమారి, ఎస్‌ఐ చిన్నరెడ్డప్పకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో.. సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతుల్లేకుండా తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని తొమ్మిది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను సీజ్‌చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్‌ఐ రెడ్డప్ప వాహనాలను పోలీస్‌స్టేషన్‌కి తరలిస్తుంటే టీడీపీ కూటమి నాయకులు వారిపై గొడవకు దిగారు.
అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు..: ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడు, చెన్నైకి చెందిన శరవణ అక్కడకు చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అరుణకుమారిని, ఎస్‌ఐ రెడ్డప్పను ‘మీకు తట్టాబుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది. త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా’.. అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. ఇదే సమయంలో అక్కడ ఫొటోలు తీస్తున్న సాక్షి విలేకరిని ‘నువ్వెవరు ఫొటోలు తీయడానికి.. నీ అంతుచూస్తా’.. అంటూ బెదిరిస్తూ పైపైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు.