సినిమా రేంజ్‌లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..

TDP Leaders Overaction On Damavaram Airport - Sakshi

శంకుస్థాపన.. కాంట్రాక్ట్‌ రెండూ డూపే 

టీడీపీ నేతల భూదందానే అడ్డంకి 

అధికారంలో ఉన్న ఐదేళ్లూ మౌనం 

ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు స్టిక్కర్‌ శిలాఫలకాలు 

రాష్ట్ర బడ్జెట్‌లో రూపాయి నిధులు కేటాయించని బాబు 

ఇప్పుడొచ్చి వగలాడి మాటలు 

కావలి: దామవరం విమానాశ్రయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆద్యంతం డూప్‌ షోగా సాగించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఎయిర్‌పోర్టు శంకుస్థాపన డూప్‌ షో చేసింది. ఐదేళ్లూ అధికారంలో ఉండీ ఏ బడ్జెట్‌లోనూ రూపాయి నిధులు కేటాంచని చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు హడావుడిగా స్టిక్కర్లతో శిలాఫలాలు వేసి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ ప్రతిపాదిత భూముల్లో పిచ్చిమొక్క కూడా పీకలేదు. దీన్ని బట్టి కాంట్రాక్టర్‌ డూప్‌ అని తేటతెల్లమైంది.   

జిల్లాకే ప్రతిష్టాత్మకమైన దామవరం ఎయిర్‌పోర్టుకు టీడీపీ నేతల భూ దోపిడీనే శాపంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు భూ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఆ శాపం నుంచి విముక్తి కలిగించేందుకు మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దామవరంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు స్వయంగా ఆ పార్టీ నేతలనే ఖంగుతినేలా చేశాయి. భూ రాబందుల్లా మారిన టీడీపీ నేతల నిర్వాకం కారణంగానే విమానాశ్రయ నిర్మాణం నిలిచిపోయిందని జిల్లా అంతా తెలిసినా చంద్రబాబు మాత్రం యథావిధిగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. భూ దోపిడీ ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి సైంధవుల్లా అడ్డుపడిన జిల్లా నేత, భూ దందా చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జి, అతని బినామీని పక్కన పెట్టుకునే చంద్రబాబు పసలేని విమర్శలు చేయడం విశేషం. 

ఇదీ విమానాశ్రయం కథ 
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో జిల్లా పర్యటనలో విమానాశ్రయాన్ని ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా, జాతీయ రహదారిని ఆనుకుని రవాణాకు సౌకర్యంగా ఉండేలా కావలి నియోజకవర్గంలోని దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,300 ఎకరాల్లో భారీ విమానాశ్రయం నిర్మించేలా డీపీఆర్‌ కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం చెందడంతో అనంతరం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. 2009–2014 మధ్య విమానాశ్రయ నిర్మాణంపై నిర్లిప్తత ఆవరించగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగింది.

2014లో టీడీపీ అధికారంలో రావడంతో విమానాశ్రయ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములు ఉన్న ప్రాంతంపై రాబంధుల్లా వాలిపోయారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు విమానాశ్రయం కోసం భూసేకరణ వ్యవహారం తల»ొప్పి కట్టేలా చేసింది. దామవరం ప్రతిపాదిత  విమానాశ్రయ నిర్మాణ భూముల అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు భీతిల్లిపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు.

ఈ క్రమంలో 2016లో అప్పటి కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో 2017 మే నెల 18న  నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర  పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని పక్క జిల్లాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో అన్ని రాజకీయ పారీ్టలు అధికార టీడీపీ నేతల వైఖరిని తూర్పార బట్టాయి. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదలిక 
2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయ నిర్మాణానికి భూ సేకరణపై దృష్టి పెట్టి వివాదాలు పరిష్కరిస్తూ 1,310 ఎకరాలు సేకరిచింది. కేంద్ర విమానాయన శాఖకు చెందిన ‘ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా’ దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాశ్రయ నిర్మాణ సంస్థ తమ వద్ద నిధులు లేవని ఏడాదిన్నర తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. ఈ క్రమంలో నిర్మాణ ప్రక్రియ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇటీవల ముంబయికి చెందిన విమానానాశ్రయ నిర్మాణ సంస్థ ప్రతినిధులను సంప్రదించి వారిని దామవరం తీసుకొచ్చి భూములు, విమానాశ్రయ లాభదాయక నిర్వహణ అంశాలను తెలియజేశారు. ఇది ప్రైవేట్, ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించి, నిర్వహించే విమానాశ్రయం కావడంతో ఈ రంగంలో అనుభవం ఉన్న  పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం నడిపిన డ్రామా
దామవరం వద్ద ఎయిర్‌పోర్టు రద్దు వివాదం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ఇక్కడే ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నట్లు మళ్లీ ప్రకటించి రెండేళ్లకు పైగా షో చేసింది. తొలుత ప్రతిపాదిత భూ విస్తీర్ణాన్ని కుదించింది.  
- 1,352 ఎకరాల్లో రూ.398.56 కోట్లతో దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సెప్టెంబర్‌ 2017లో ఓ నిర్మాణ సంస్థకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. 
- ఈ మేరకు 21 జూన్‌ 2018లో ఆ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్‌ చేసుకుంది. ఆ అగ్రిమెంట్‌లో నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను కనపరచాల్సి ఉంది. అయితే అదే ఏడాది డిసెంబర్‌ 21వ తేదీ వరకు కూడా నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను ప్రభుత్వానికి చూపలేదు. ఇదొక బోగస్‌ నిర్మాణ సంస్థ అని తెలిసినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు విమానాశ్రయ నిర్మాణానికి 11 జనవరి 2019 శంకుస్థాపన చేశారు. 
- ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన సంస్థ పనులు ప్రారంభిస్తుందని ఏడాది పాటు ప్రభుత్వం ఎదురు చూసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో 15 జూలై 2019లో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్‌ను రద్దు చేసింది.  
- దీన్ని బట్టి నిర్మాణ సంస్థ ఓ బోగస్, శంకుస్థాపన ఒక డూప్‌ షో అని  తేలిపోయింది.  

దామవరంలోనే విమానాశ్రయం  
దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి టీడీపీ నాయకులు చేసిన దుర్గార్మాలు దారుణాల వల్లే సమస్య జఠిలంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసేకరణ చిక్కుముళ్లను ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక అధికారులు దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సాధ్యపడలేదన్నారు. ఎన్నికలకు ముందు అదే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ టీడీపీ ప్రజలను వంచిచే పనులకు పరాకాష్ట. దామవరం విమానాశ్రయ నిర్మాణానికి సంక్లిష్టతగా మారిన భూసేకరణ సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేయించగలిగింది. అయితే నిర్మాణానికి పెట్టుబడులు పెట్టే వారికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.
– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top