రాజ్యసభ సీట్ల కోసం పోటాపోటీ
అనుచరుడిని అందలం ఎక్కించేందుకు చినబాబు ఆరాటం.. వ్యతిరేకిస్తున్న సీనియర్లు.. అయినా ఆయనవైపే మొగ్గు
తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని ‘గల్లా’ పట్టు.. చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్న మరికొందరు నేతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండడంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితమే ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్‌బాబు (కాల పరిమితి ముగియనుంది)కు రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతోంది. చినబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతోపాటు ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన్ను పక్కనపెట్టే అవకాశం లేశ మాత్రం కూడా లేదనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరో స్థానంపై మాత్రం విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే తన అనుయాయుడికే ఇస్తానని చినబాబు స్పష్టం చేస్తున్నారు.
ఆ అనుయాయుడు ఇప్పటికే ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని విషయాలు చూసుకుంటూ సూపర్ బాస్‌గా మారిపోయారు. ఆయనకు మరింత ‘రాజసం’ కల్పించేందుకు రాజ్యసభ ఎంపీ పదవి కావాల్సిందేనని తద్వారా తన మనిషిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని చినబాబు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీనియర్ నేతలు మండిపడుతూ అనుచరుడిగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద పదవి కట్టబెడితే ఇక తాము ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న తమను కాదని ఎన్నికల్లో డబ్బు సమకూర్చిన వారికి, తమ పనులు చేసే వారికి పదవులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదని వాపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు చంద్రబాబుకే చెప్పినా ఆయన కూడా ఆర్థికంగా అండదండలు అందించిన వారిని కాదనలేమని అంటున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు.
జయదేవ్ లాబీయింగ్
మరోవైపు రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటును వదులుకుని తప్పు చేశానని మదనపడుతున్న ఆయన ఎలాగైనా సరే మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టాలనే పట్టుదలతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన భాష్యం రామకృష్ణ కూడా ఎన్నికల్లో అండగా నిలిచాను కాబట్టి రాజ్యసభకు పంపాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తదితరులు రాజ్యసభ స్థానంపై కన్నేసి చంద్రబాబుపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరికీ మాట ఇవ్వకుండా చూద్దాం అని చెబుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తమను అన్ని రకాలుగా పార్టీ కోసం ఉపయోగించుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన తరఫున లింగమనేని పేరు
జనసేనకు ఈసారి ఒక స్థానం దక్కుతుందని అది లింగమనేని రమేష్‌కి ఇస్తారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. ఆయన అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్‌కి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మారితే తప్ప జనసేనకు ఒక స్థానం కేటాయిస్తే అది రమేష్‌కి ఖరారవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా ఖాళీ అయ్యే నాలుగు ఎంపీ స్థానాల్లో కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ తరచూ చేసే ఢిల్లీ పర్యటనలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీల్లో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగింటిలో ఒక్కోటి బీజేపీ, జనసేనకు వదిలినా రెండు కచ్చితంగా టీడీపీకి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే తమకు మూడు స్థానాలు ఇస్తే బాగుంటుందని ముఖ్య నేత అడుగుతున్నా అందుకు బీజేపీ సుముఖంగా లేదనే వాదన వినిపిస్తోంది.


