పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..! 

TDP kala venkata rao Organised Idem Karma Program at Wedding - Sakshi

పెళ్లి కొచ్చి పార్టీ నిరసన ప్రోగ్రాం

కళా వెంకటరావు తీరుపై తెలుగు తమ్ముళ్ల ధ్వజం

సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్న టీడీపీ శ్రేణులు  

సాక్షి, శ్రీకాకుళం: ‘ఎన్నిసార్లు పార్టీ పరువు తీస్తారు కళా వెంకట్రావు? మీరు ఇంకా ఇన్‌చార్జిగా ఉండడం మా ఖర్మ! పెళ్లికి వెళ్లి పార్టీ ప్రోగ్రాం చేసే ఖర్మ తెలుగుదేశం ఇన్‌చార్జికి పట్టిందా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్నే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి పార్టీలో చేర్చుకునే ఖర్మ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జికి పట్టిందా? 10 మందితో పేరుకి ప్రోగ్రామ్‌ చేస్తారా? కారులో నుంచి దిగి 5 నిమిషాలు స్టేజీ మీద ఉండి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రోగ్రామా? కేశవరాయునిపాలెం గ్రామంలో మీరు ఇవాళ ఏం పని మీద వచ్చారు? ఏమి చేశారు? పెళ్లికి వచ్చిన బంధువులు, కార్యకర్తలతో కలిసి ఇదేమి ఖర్మ బ్యానర్‌ పెట్టి నాలుగు ఫోటోలు దిగితే ప్రోగ్రామ్‌ ఐపోయినట్టేనా? పార్టీ పరువు ఎన్ని విధాలుగా.. ఎన్ని సార్లు తీస్తారు?’ అంటూ సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు.  

ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తే ఆరోపణలు, విమర్శలవుతాయి. అదే సొంత పార్టీ కార్యకర్తలు.. అదీ పార్టీ కార్యక్రమంపైన ధ్వజమెత్తితే ఏమనుకోవాలో టీడీపీ మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకటరావే చెప్పాలి. టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును సొంత పార్టీ కార్యకర్తలే ఏకిపారేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఏకంగా పార్టీ అప్రతిష్ట పాలవుతుందని తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. ఎంతో సీనియరై ఉండి జూనియర్‌ కంటే దారుణమైన రీతిలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా సోషల్‌ మీడియాలో, పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో కడిగి పారేస్తున్నారు.   

పెళ్లి వేడుకకు వచ్చిన నాయకులతో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. 

లావేరు మండలం కేశవరాయునిపాలెంలో పార్టీ నాయకుడు నాయన శంకర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు కళా వెంకటరావు శుక్రవారం హాజరయ్యారు. మండల పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని అక్కడికక్కడే నిర్వహించారు. మరోసారి పిలుపిస్తే వచ్చే కొద్ది పాటి కార్యకర్తలు, నాయకులు హాజరవరనో.. పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించరనో గానీ అప్పటికప్పుడే బ్యానర్‌ పెట్టి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది.

ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తే వేరు.. సాక్షాత్తు తోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళా వెంకటరావుపై భగ్గుమంటున్నారు. పాలఖండ్యాంలో పార్టీలో చేరికల పేరుతో టీడీపీ కార్యకర్తల్నే చేర్పించి సాధించిందేంటి? ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో చేరికలు పేరుతో మీరు చేసిందేంటి? ఎన్నిసార్లు మీ తప్పులు మీకు ఎత్తి చూపించినా మారకపోతే ఏమనాలి? అని గట్టిగా నిలదీస్తున్నారు. మీ లాంటి వారిని మోయాల్సి రావడం నిజంగా మా ఖర్మ.. అంటూ సోషల్‌ మీడియా, పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో కళా తీరును కడిగిపారేస్తున్నారు. వాస్తవంగా టీడీపీకి, ఆయనకు జనాదరణ లేకపోవడంతో పెళ్లికొచ్చిన జనాలతో కార్యక్రమాన్ని చేసేద్దామనుకోవడం బూమ్‌రాంగైంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top