
‘‘యోగాంధ్ర పేరిట కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రెండు కోట్ల మందికి పైగా యోగాంధ్ర–2025లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సర్కారు చెప్పడం అంతా బోగస్‌లా ఉంది.. ఎందుకంటే నేను నమోదు చేసుకోకపోయినా చేసుకున్నట్లు నాకు మెసేజ్ వచ్చింది. ’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. అదేవిధంగా మూడేళ్ల కిందట మరణించిన తన తండ్రి విశాఖలో జరిగే యోగాంధ్రలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మెసేజ్ వచ్చినట్టు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అక్కిం ముసలప్ప తెలియజేశారు.
అసలు యోగా గురించి తెలియని తన ఐదేళ్ల కుమార్తె కూడా యోగాంధ్రలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకుందని మెసేజ్ వచ్చినట్లు విశాఖకు చెందిన ఓ యువకుడు తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తమకు తెలియకుండానే యోగాంధ్ర–2025లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌లు చేశారని వెల్లడించారు. వారిలో కొందరి వివరాలు ఇవిగో...

‘ఆత్మ’లకు ‘యోగ’ం
నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన మైలా సోమయ్య 2017 ఫిబ్రవరిలో మృతి చెందారు. అయినా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పేరు ఎన్‌డీఎల్–290525–22200564 నంబర్‌తో రిజిస్టర్ చేశారు. మనిషి బతికి ఉన్నాడా.. చనిపోయాడా అని కూడా తెలుసుకోకుండానే సచివాలయ ఉద్యోగులు రిజిస్టర్ చేశారు. సోమయ్య కుమారుడు మైలా లోకేశ్ పేరును సైతం రిజిస్టర్ చేశారు. ఇతను చాలా ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు తెలియకుండానే యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ చేయడమేకాకుండా అతను పాల్గొన్నట్లు సరి్టఫికెట్ సైతం రావడం గమనార్హం.
మూడేళ్ల కిందట మృతిచెందినా...
ఈ చిత్రంలోని కనిపిస్తున్న వ్యక్తి పేరు అక్కిం చిన్న నరసింహుడు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన నరసింహుడు వృద్ధాప్యం కారణంగా 2022 డిసెంబర్ 18న మృతిచెందాడు. అయితే, ఆయన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నరసింహుడు కుమారుడు అక్కిం ముసలప్ప సెల్‌ఫోన్‌కు ఈ నెల 7వ తేదీన మెసేజ్ వచ్చింది. ఇదెలా సాధ్యమంటూ ఆయన ఆశ్చర్యపోయారు.
బోగస్ రిజిస్ట్రేషన్లతో ప్రజా ధనం వృథా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
తాను యోగాంధ్ర–2025 కార్యక్రమానికి పేరు నమోదు చేసుకోకపోయినా.. తాను నమోదు చేసుకున్నట్టు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లలో రిజి్రస్టేషన్లు అయ్యాయని కూటమి ప్రభుత్వం చెబుతోందని.. అందులో ఇలాంటి బోగస్ రిజిస్ట్రేషన్లు చాలానే ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మాదిరి బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎందుకు వృథా చేయాలని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
పిల్లల పేర్లతోనూ...
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ దత్తత తీసుకున్న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి కాటెపోగు భార్గవ్ సైతం యోగాంధ్రలో పాల్గొంటున్నట్టు నమోదు చేశారు. ఆ చిన్నారి పేరును ఎన్‌డీఎల్– 290525–20742711 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేశారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన చిటికిరెడ్డి ఎర్ని టాటా సన్యాస నాగ నిరుపమ అనే ఐదేళ్ల చిన్నారికి ‘యోగాంధ్ర’లో రిజి్రస్టేషన్ అయినట్లుగా ఈ నెల 7న మెసేజ్ వచ్చింది. ఈ పాప తల్లిదండ్రులు రిజి్రస్టేషన్ చేయాలని కోరలేదు. అయినప్పటికీ ఆ పాప తండ్రి పేరు మీద, ఆ చిన్నారి పేరు మీద రిజి్రస్టేషన్ అయినట్లు వచ్చింది.
ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన ఆరేళ్ల బాలిక బ్రియానా ‘యోగాంధ్ర’లో పాల్గొనేందుకు రిజి్రస్టేషన్ చేసుకున్నట్లు ఆమె తండ్రి సెల్‌ఫోన్‌కు జూన్ 8వ తేదీన మెసేజ్ వచ్చింది. ‘మీరు యోగాంధ్ర–2025’లో పాల్గొనేందుకు ఆసక్తి చూపినందుకు అభినందనలు’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.

ప్రజోపయోగం v/s దుర్వినియోగం
‘‘విశాఖపట్నంలోని రిషికొండలో వైఎస్ జగన్‌రూ.400 కోట్లతో అందమైన శాశ్వత భవన సముదాయం నిర్మించారు. చంద్రబాబు అదే విశాఖలో రూ.300 కోట్లు ఖర్చు చేసి యోగా డే నిర్వహించారు. ఎవరు ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడే పని చేశారు? ఎవరు ప్రజాధనాన్ని వృథా చేశారు? ఈ రాష్ట్రానికి ఏది అవసరం.. ఎవరు ప్రజాధనాన్ని సద్వినియోగం చేశారు... ఎవరు దుర్వినియోగం చేశారు...’’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. యోగా డే పేరుతో
చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేయడంపై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.