రోప్‌ పార్టీకి దిక్కులేదు.. జెడ్‌ ప్లస్‌ భద్రత ఇస్తున్నారంట! | TDP Government Conspiracy On Ys Jagan Security: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రోప్‌ పార్టీకి దిక్కులేదు.. జెడ్‌ ప్లస్‌ భద్రత ఇస్తున్నారంట!

Jul 4 2025 2:42 AM | Updated on Jul 4 2025 5:35 AM

TDP Government Conspiracy On Ys Jagan Security: Andhra pradesh

అసలు జగన్‌ పర్యటనల్లో రోప్‌ పార్టీని ఎందుకు పెట్టడంలేదు?

ఈ విషయంలో దాగుడు మూతలు ఏంటో అర్థంకావడంలేదు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కనీస స్థాయిలో పాటించడంలేదు

అడుగు కూడా వేయలేని చోట హెలిప్యాడ్‌కు అనుమతిచ్చారు

అందుకే జగన్‌ తన పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌

పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం: ఏజీ ∙విచారణ బుధవారానికి వాయిదా

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నామని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఆయన పర్యటనల్లో రోప్‌ పార్టీని కూడా ఏర్పాటుచేయడం లేదని సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ హైకోర్టుకు నివే­దిం­చారు. జగన్‌ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థంచేసుకోవ­చ్చునన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్‌ పార్టీది కీలకపాత్ర అని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్‌ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్‌కు అన్నిర­కాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రోప్‌ పార్టీని ఎందుకు ఏర్పాటుచేయడం లేదో చెప్పడం లేదన్నారు.

రోప్‌ పార్టీ విషయంలో ఎందుకు దాగు­డు­మూతలు ఆడుతోందో అర్థంకావడంలేదన్నారు. అది లేకుంటే జగన్‌ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్‌ స్పష్టంచేశారు. జగన్‌ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న జగన్‌కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్‌ ఏర్పాటునకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్రజాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్‌ ఏర్పాటుకు అను­మ­తిచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు, పొదలు తొల­గించడానికే మూడ్రోజులు పడుతుందని శ్రీరామ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో జగన్‌ తన నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్‌కు రోప్‌ పార్టీతో సహా అన్నీ రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రమే కాకుండా, ఆయన చేసే ప్రతీ పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. జగన్‌కు సేఫ్‌ ట్రావెల్, సేఫ్‌ ల్యాండింగ్, సేఫ్‌ మూవ్‌మెంట్‌ అన్నది కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే జగన్‌ భద్రత కోసం ప్రభుత్వ నిర్లక్ష్యంపై 
రెండు పిటిషన్లు దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, జగన్‌ పర్యటన వాయిదా నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ నిరర్థకమైందన్నారు. జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నామన్నారు. జడ్‌ ప్లస్‌ వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ­కాలతో పిటిషనర్లు అనుబంధ పిటిషన్‌ వేశారని, దీనికి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచార­ణను బుధవా­రా­నికి వాయిదా వేసింది. ఆ రోజుకి కౌంటర్‌ దాఖలు చేయాలని, ఆ రోజునే వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువా­రం ఉత్తర్వులు జారీచేశారు. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి హెలీప్యాడ్‌ ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement