సామాజిక న్యాయ మహా శిల్పం ప్రాంగణంలో చెత్తాచెదారం, నాచుతో నిండి ఉన్న ఫౌంటైన్
విజయవాడ నడిబొడ్డున మహోన్నత ఆశయంతో నిర్మించిన వైఎస్ జగన్
జగన్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అక్కసు
ప్రాంగణంలోకి తప్ప మహాశిల్పం లోపలికి అనుమతించని సర్కారు.. పారిశుద్ధ్య నిర్వహణ గాలికి.. ప్రాంగణమంతా చెత్తా చెదారం
జీతాల కోసం ఆందోళన చేశారనే అక్కసుతో సిబ్బందిని తొలగించే ప్రయత్నాలు
సాక్షి, అమరావతి: భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచేలా విజయవాడ నగరం నడిబొడ్డున వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం కక్ష కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 ఎకరాల్లో సుమారు రూ.297.71 కోట్లతో మహోన్నత ఆశయంతో నిర్మించిన అద్భుత ప్రాంగణం అసలు లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.
వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం రాగానే సామాజిక న్యాయ మహాశిల్పంపై వక్రదృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే స్వరాజ్ మైదానంలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం పేరు (స్టీల్ అక్షరాలు)ను తొలగించారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో దానిలో వైఎస్ జగన్ పేరు తొలగించి అంబేడ్కర్ పేరును మాత్రం మళ్లీ ఏర్పాటు చేశారు.
అంతటితో ఆగకుండా ఆ ప్రాంగణంలో గత ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆడిటోరియం, లైబ్రరీ తదితర నిర్మాణాలను సైతం నిలిపివేసింది. డ్వాక్రా బజార్ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేయించింది. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవడంతో నెల తర్వాత ఆ స్టాల్స్‌ను తొలగించింది.
ప్రైవేటు పరానికి యత్నం
భారత రాజ్యాంగ నిర్మాత చరిత్ర, ఆయన ఘనతను నిలువెత్తున నిలబెట్టిన సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది పోయి పీపీపీ పద్దతిలో ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిపై వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, దళిత, గిరిజన సంఘాలు ఈ ఏడాది జనవరిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
చెత్తాచెదారాల మయం
ప్రైవేటీకరణ ప్రయత్నం బెడిసికొట్టడంతో సర్కారు మరో కుయుక్తి పన్నింది. ఆ ప్రాంగణాన్ని ఎవరూ సందర్శించకుండా చేయడానికి పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. ఒకప్పుడు పచ్చటి పచ్చిక బయళ్లు, పిల్లల ఆటస్థలాలు, ఉవ్వెత్తున ఎగసే అందమైన ఫౌంటైన్లు, రంగురంగుల విద్యుద్దీపాలతో, నిత్యం వేలాది సందర్శకులతో కళకళలాడిన ఈ ప్రాంగంణం ఇప్పడు చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రాంగణంలోని వాటర్ ఫౌంటైన్లలో నీరు మార్చకపోవడంతో అవి నాచు, చెత్తతో నిండిపోయాయి.

సిబ్బందికి 9 నెలలు వేతనాలు నిలిపివేత
ఇక్కడ పనిచేస్తున్న 23 మంది సిబ్బందికి 9 నెలల క్రితం ప్రభుత్వం జీతాలు నిలిపివేసింది. అక్టోబరు 3 నుంచి వారు ధర్నాలు చేపట్టడంతో తొలుత ఒక నెల జీతం మాత్రమే ఇచ్చింది. మళ్లీ ఆందోళనకు దిగడంతో కొద్ది రోజుల క్రితం 6 నెలల జీతాలు చెల్లించింది. ఆందోళన చేశారనే అక్కసుతో ఇప్పుడు వారిలో కొందరిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఇది మరో దారుణం
అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం దేశంలోనే ఓ స్ఫూర్తిదాయక ప్రదేశం. ఇక్కడ కేవలం అంబేడ్కర్ నిలువెత్తు శిల్పమే కాదు.. అంబేడ్కర్ చరిత్రను ఆవిష్కరించారు. మహాశిల్పం పెడస్టల్ (పీఠం)లోని 3అంతస్తుల్లో అంబేడ్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ చిత్రాలు, లైబ్రరీతోపాటు ఆడిటోరియం కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిని నీరుగార్చేలా ఎవరినీ లైబ్రరీ, ఆడిటోరియం లోపలికి అనుమతించడంలేదు. సందర్శకులను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వం పథకం ప్రకారమే ఇలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


