
వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
మేం ఈ కేసును పర్యవేక్షించడం ఏమిటి?
ఈ వాదనలను సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదు?
ఒక దాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేదెప్పుడు?.. ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది
దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే కదా చార్జిషీట్లు వేసింది
అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరి మీరు సాధించేదేంటి?
బెయిల్ రద్దు విషయంలో మేం జోక్యం చేసుకోం..
సునీతను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలన్న వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చార్జిషీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రశ్నించింది. ఒకదానివెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేదెప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాకే కదా చార్జిషీట్లు వేసిందని ప్రశ్నించింది.
మీరు ఇపుడు చేస్తున్న వాదనలను విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని నిలదీసింది. ఇదే సమయంలో వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులకిచి్చన బెయిల్‌ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ రద్దు, తదుపరి దర్యాప్తు కోసం సునీత పిటిషన్లు...
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచి్చన ముందస్తు బెయిల్, బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీతరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. తదుపరి దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్.వి. రాజు స్పందిస్తూ, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు. కోర్టు ఆదేశిస్తేనే తప్ప తదుపరి దర్యాప్తు చేయపట్టబోమన్నారు.
13 లక్షల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది...
వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, నాగముత్తు వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు. భారీ స్థాయిలో చార్జిషీట్‌లు కూడా దాఖలు చేసిందన్నారు. 13 లక్షల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని తెలిపారు. ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉండదన్నారు.
ఇలా అయితే దశాబ్ద కాలం పడుతుంది...
ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, చార్జిషీట్లు దాఖలైన తరువాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏమిటంటూ ప్రశ్నించింది. ఇలా ఒక దాని వెంట మరొక పిటిషన్ దాఖలు చేసుకుంటూ వెళుతుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికే దశాబ్ద›కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీరు చెబుతున్న వాదనను దర్యాప్తు సమయంలోనే సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. నిందితులపై ఇప్పటికే సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసిందని గుర్తు చేసింది. ఇంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది.
‘దర్యాప్తు పూర్తి చేసిన తరువాతనే కదా చార్జిషీట్లు వేసేది. మరి అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరడం ద్వారా మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు’ అంటూ సునీతను ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దానిని ఓ తార్కిక ముగింపునివ్వాలంది. తదుపరి దర్యాప్తు విషయాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. అలాగే నిందితుల బెయిల్ రద్దు విషయంలో కూడా జోక్యం చేసుకునేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రర్బ్ చేయబోమంది. తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ కోర్టునే ఆశ్రయించాలని సునీతను ధర్మాసనం ఆదేశించింది. రెండువారాల్లోగా తాజా పిటిషన్ దాఖరు చేసుకోవచ్చని, ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే దానిని 8 వారాల్లోపు తేల్చాలని సీబీఐ కోర్టుకు తేల్చిచెప్పింది. సీబీఐ తనంతట తానుగా కాకుండా సీబీఐ కోర్టు ఆదేశాలు ఇస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.