
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ బదిలీకి రంగం సిద్ధం
జాయింట్ కలెక్టర్‌గా వెళ్లాలనుకుంటున్న పృథ్వీతేజ్
ఆ స్థానంలోకి మళ్లీ రావాలనుకుంటున్న సంతోషరావు
ఏపీఎస్పీడీసీఎల్ కావాలని అడుగుతున్న పుల్లారెడ్డి
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో ఇన్నాళ్లూ కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలతో తీరిక లేకుండా గడిపిన ఉన్నతాధికారులకు ఇప్పుడు వారి వంతు వచ్చిoది. దీంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కొత్త బాస్‌లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయడమే ఇందుకు కారణం. ఒక్కో డిస్కంకు ఒక్కో సమయంలో సీఎండీల నియామకం జరుగుతుంటుంది. కానీ ఈసారి మూడు డిస్కంలకు ఒకేసారి సీఎండీల స్థాన చలనం జరిగే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు చెబుతున్నాయి.
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీగా ఉన్న ఐ.పృథ్వీతేజ్ బదిలీ దాదాపు ఖరారైంది. జేఎండీగా, సీఎండీగా విశేష అనుభవం ఉన్న పృథ్వీతేజ్ గత ప్రభుత్వంలో సీఎండీ అయ్యారు. కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా బాధ్యతలతో పాటు విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.
కూటమి పార్టీల నాయకులు కొందరు ఆయనపట్ల గుర్రుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన ఉద్యోగుల బదిలీల్లో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు వెల్లువెత్తాయి. వారు చెప్పినవారికి పోస్టింగులు కూడా వచ్చాయి. ఉద్యోగుల సంఘాలతోనూ పృథ్వీ సానుకూలంగానే ఉంటున్నారు. అయినప్పటికీ కొందరు నేతలు తాము చెప్పిన పనులను చేయడం లేదంటూ ఆయన బదిలీకి ప్రభుత్వ పెద్దల వద్ద పట్టుబట్టారు.
ఇదంతా తెలిసి సీఎండీ కొద్ది రోజుల కిందట సంబంధిత నాయకులను కలిసి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మరికొంత కాలం ప్రస్తుత స్థానంలోనే కొనసాగించాలని అభ్యర్థించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఉత్తరాంధ్రలో ఏదైనా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా పంపించాలని కోరారని తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. పృథ్వీ బదిలీ ఖరారవడంతో ఆ స్థానంలోకి తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ కె.సంతోషరావు ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలోనూ సీఎండీగా కొన్నేళ్లు పనిచేశారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా ఇటీవలే వచ్చిన పి.పుల్లారెడ్డి తనను ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీగా పంపాలని అడుగుతున్నారు. దీంతో ముగ్గురు సీఎండీలకు స్థాన చలనం కలిగే అవకాశముంది. సంతోషరావు, పుల్లారెడ్డిలను కదిపినా కదపకపోయినా, ఒక కొత్త సీఎండీ రావడం ఖాయం.