రుతుపవనాలు మరింత ఆలస్యం | Southwest Monsoons likely to pick up in June: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రుతుపవనాలు మరింత ఆలస్యం

May 27 2026 3:33 AM | Updated on May 27 2026 3:34 AM

Southwest Monsoons likely to pick up in June: Andhra pradesh

జూన్‌ రెండో వారంలో ఏపీని తాకే అవకాశం

సాక్షి, అమరావతి: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వచ్చే నెల 4వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనుకున్న రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీకే రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించడంతో సకాలంలోనే అవి దేశమంతటా విస్తరిస్తాయని తొలుత భావించారు. అయితే అవి ఇంకా పూర్తి స్థాయి­లో అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించలేదు. 

నెల 30 నాటికి కేరళను తాకే అవకాశం ఉందనుకున్నా ఇప్పుడు నాలుగు రోజులు ఆలస్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి వారం రోజుల వరకు పట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నా­రు. జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరు వరకూ ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని ఆ తర్వాత నుంచి నెమ్మదిగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మంగళవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. 

125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నా­డు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు,  మార్కాపురం జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా పల్నాడు జిల్లా గురజాలలో 47.6, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నేడు వడగాలులు తీవ్రం
బుధవారం పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో­ని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

 మరోవైపు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement