మూణ్ణెల్ల కిందట భర్తను చంపిన భార్య
తల్లీకూతుళ్ల గొడవతో వెలుగులోకి..
పోలీసుస్టేషన్‌లోలొంగిపోయిన నిందితురాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘటన
కళ్యాణదుర్గం రూరల్: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన పాపానికి అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తనే ఓ ఇల్లాలు విచక్షణారహితంగా హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకోసి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. అప్పుల బాధ తాళలేక తన భర్త ఎటో వెళ్లిపోయాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించింది. అయితే, మూణ్ణెల్ల తర్వాత కూతురితో జరిగిన గొడవలో నిందితురాలే మాట జారడంతో హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. ఆపై స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలివీ..
పద్ధతి మార్చుకోమన్నందుకు పాతిపెట్టింది..
కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన హనుమంతుకు సుకన్యతో 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇంటర్ చదివే కూతురు అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. దంపతులిద్దరూ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుకన్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని హనుమంతు గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పిచూశాడు. అయినా ఆమె లెక్కచేయలేదు.
ఈ క్రమంలో ముణ్ణెళ్ల క్రితం హనుమంతు మద్యం తాగి ఇంటికొచ్చాడు. తమ మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ భార్య సుకన్యతో గొడవపడ్డాడు. దీంతో సుకన్య భర్తపై దాడి చేసి గొంతుకోసింది. హనుమంతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టింది. అనంతరం.. అప్పుల బాధ తాళలేక తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించింది.
తల్లీకూతుళ్ల గొడవతో వెలుగులోకి..
సుకన్య తన కూతురు అమృతతో శుక్రవారం గొడవపడింది. ఆ ఆవేశంలో.. ‘నిన్నూ మీ నాన్నలాగే చంపేస్తా’ అంటూ నోరుజారింది. దీంతో హనుమంతు హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. రూరల్ సీఐ గణేశ్ తన బృందంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.


