చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం సాయంగా వచ్చిన 8 ఏళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరులోని పెద్ద మసీదు వీధికి చెందిన జమీర్ బాషా అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయకుడిగా వచ్చాడు. అదే సమయంలో పట్టణంలోని రాణిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి చికిత్స అందిస్తున్నారు.
వారితో పాటు 8 ఏళ్ల చిన్నారి కూడా ఆస్పత్రికి వచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చిన్నారికి నిద్ర వస్తుండటంతో కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న గదిలోని బెడ్‌పై పడుకోబెట్టారు. చిన్నారి ఒంటరిగా నిద్రిస్తున్న విషయం గుర్తించిన జమీర్‌బాషా చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు.
చిన్నారి కేకలు వేయడంతో ఆస్పత్రి భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని జమీర్‌బాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పారు.


