డబ్బులు డిమాండ్‌తోనే దారుణ హత్య | Shocking Incident in Gajuwaka | Sakshi
Sakshi News home page

డబ్బులు డిమాండ్‌తోనే దారుణ హత్య

Mar 31 2026 4:57 AM | Updated on Mar 31 2026 4:58 AM

Shocking Incident in Gajuwaka

నిందితుడు రవీంద్ర, మృతురాలు మౌనిక (ఫైల్‌), ఫ్రిజ్‌లో ఉంచిన మౌనిక శరీర భాగాలు

డేటింగ్‌ యాప్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం

పెళ్లయ్యాక కూడా మృతురాలితో రిలేషన్‌షిప్‌లో నిందితుడు

ఇది తెలిసి ఇద్దరి మధ్యా గొడవలు

దీంతో మృతురాలు మౌనిక పాశవికంగా హత్య

ముక్కలు ముక్కలుగా చేసి ప్యాకింగ్‌

విశాఖలో యువతి హత్య ఘటన వివరాలు వెల్లడించిన గాజువాక పోలీసులు  

గాజువాక: రిలేషన్‌షిప్‌ పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్‌ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్‌ నేవీలోని ఐఎన్‌ఎస్‌ డేగాలో పెట్టీ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎలీ్వనగర్‌లోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు.

రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్‌ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్‌షిప్‌కు దారితీసింది.

పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం  రిలేషన్‌షిప్‌ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక  వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మి కి షేర్‌ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను  హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు.  

పక్కా ప్లాన్‌తో పాశవిక హత్య.. 
ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్‌ వేశాడు. ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్‌రూమ్‌లో శుభ్రంగా కడిగి కవర్‌లో ప్యాక్‌ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్‌ సూట్‌కేసులోను పెట్టాడు.

కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్‌లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్‌చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్‌ సేకరించారు. కవర్‌లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement