ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్‌ చేసిన ప్రియుడు..! | Shocking Facts About Eluru Lover's Incident | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్‌ చేసిన ప్రియుడు..!

May 30 2026 11:34 AM | Updated on May 30 2026 11:40 AM

Shocking Facts About Eluru Lover's Incident

ఏలూరు టౌన్‌: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఏలూరు పోలీస్‌సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు 
ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్‌ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్‌నెంబర్‌ 81/2026, విమెన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు.

 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్‌ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్‌ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్‌ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్‌ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్‌ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్‌ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు.  

చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య 
ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్‌ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్‌ జంక్షన్‌కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్‌పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమెపై పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. 

హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు.  ఐదు రోజుల అనంతరం ఏప్రిల్‌ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్‌ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కలి్పస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్‌ నుంచి భర్తకు వాట్సాప్‌ చాటింగ్‌ చేయటం, ఫోన్‌ చేసి లిఫ్ట్‌ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్‌ ఫోన్‌ పగులగొట్టి, చెరువులో పడేశాడు.  

ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు 
ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్‌ను మోటారు సైకిల్‌తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్‌ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్‌ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్‌ఎస్‌ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్‌మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు.     

Advertisement
 
Advertisement
Advertisement