స్కెచ్‌ వేశారు... పట్టుకున్నారు

Seb Raids On Cannabis Smuggling Continue At Pendurthi - Sakshi

పెందుర్తి: గంజాయి రవాణాపై వరుసగా ‘సెబ్‌’ దాడులు కొనసాగుతున్నాయి. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయిని సినీ ఫక్కీలో అధికారులు  పట్టుకున్నారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి, కారు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి సెబ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అడిషినల్‌ ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన రామ్‌ హోతాంగి, అనిషా సాబర్, ఆయూబ్‌ఖాన్, మరోవ్యక్తి ముఠాగా ఏర్పడ్డారు.

వీరంతా కలిసి సుజాతనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిలో రామ్‌ హోతాంగి ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో సుజాతనగర్‌ తీసుకొస్తుంటారు. అక్కడి నుంచి వీరంతా వేర్వేరుగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీపీ శ్రీకాంత్, సెబ్‌ అడిషినల్‌ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఇంటెలిజెన్స్‌ టీం సహకారంతో పెందుర్తి సెబ్‌ అధికారులు సుజాతనగర్‌ ఆర్చ్‌ వద్ద కాసు కాశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అనిషా చిక్కింది.

బైక్‌లో ఉన్న 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితురాలిని విచారించారు. ఆమె చెప్పిన వివరాల మేరకు సుజాతనగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేయగా అక్కడ నిల్వ ఉన్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. అదే సమయంలో సుజాతనగర్‌ వీధి చివర నిలిపిన కారులో ఉన్న 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెబ్‌ సిబ్బంది వస్తున్నారన్న సమాచారంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. నిందితుల్లో అనిషా సాబర్‌ను అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న సెబ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనాథుడు, పెందుర్తి సీఐ సరోజదేవి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అప్పలరాజు, ఇంటెలిజెన్స్‌ టీం సిబ్బందిని నగర సీపీ శ్రీకాంత్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

(చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top