
సాక్షి, అమరావతి: వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని తెరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కోవిడ్–19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా స్కూళ్ల తెరవడంపై సీఎం పలు సూచనలు చేశారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు.
తరగతులు నిర్వహించేది ఇలా..
► 1, 3, 5, 7 తరగతుల వారికి ఒక రోజు.. 2, 4, 6, 8 తరగతుల విద్యార్థులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు.
► ఒకవేళ ఏదైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.
► అన్ని స్కూళ్లలో కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి. భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారు
► నవంబర్ నెలలో ఇదే విధానం అమలవుతుంది. పరిస్థితిని బట్టి డిసెంబర్‌లో తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
► ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపకపోతే.. అలాంటి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలి.