చెల్లెలితో మాట్లాడుతున్నాడని హత్య | Samarlakota Man Ends Another Person Life, This Incident Created Sensation | Sakshi
Sakshi News home page

చెల్లెలితో మాట్లాడుతున్నాడని హత్య

Jul 5 2025 11:26 AM | Updated on Jul 5 2025 11:48 AM

samarlakota man died incident

యువకుడిపై దాడిచేసి ఇసకలో కప్పిపెట్టిన నిందితులు

 పోలీసులకు లొంగిపోయిన వైనం

 పి.వేమవరంలో సంచలనం సృష్టించిన ఘటన

కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అనుమానంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని హత్య చేసి జగనన్న లే అవుట్‌లో కప్పి పెట్టేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను సీఐ ఎ.కృష్ణభగవాన్‌ వివరించారు. పి.వేమవరానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్‌కార్తిక్‌ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ యువతి అన్నయ్య నూతలకట్టు కృష్ణ ప్రసాద్‌ అడపాదడపా గ్రామానికి వచ్చినపుడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని కార్తిక్‌ను మందలించాడు. తన చెల్లెలని బాగా చదివించాలనుకుంటున్నానని ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. 

అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గత నెల 24వ తేదీ రాత్రి కృష్ణ ప్రసాద్‌ తన స్నేహితుడు దూలపల్లి వినోద్‌ సాయంతో కార్తిక్‌ను పిలిచి పని ఉంది మాట్లాడదాం రమ్మని తీసుకువెళ్లారు. అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్‌కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసి గోతిలో కప్పిపెట్టేశారు. అనంతరం కృష్ణప్రసాద్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా గతనెల 24వ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్‌, అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కూలీలకు సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్‌ను అతని తండ్రి మందలించాడు. దీంతో కార్తిక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

కానీ ఆ రోజు రాత్రి అతడు ఇంటికి రాకపోవడం, రాత్రి పది గంటల తరువాత ఫోన్‌ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో 27వ తేదీన తండ్రి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు విషయంలో తేడా రావడంతో మందలించడంతో తమ కుమారుడు అలిగి వెళ్లి ఉంటాడని తాము భావించామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ ఎ కృష్ణభగవాన్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్‌ తన స్నేహితుడు వినోద్‌కు తరుచూ పోన్‌ చేసి ఇక్కడి పరిస్థితిని తెలుసుకునేవాడు. 

పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిసి, వారు తమను గుర్తిస్తే కేసు తీవ్రంగా ఉంటుందని భావించి గురువారం రాత్రి కృష్ణప్రసాద్‌, వినోద్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సీఐ వివరించారు. ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతో హత్య చేసినట్లు కృష్ణప్రసాద్‌ చెప్పాడని సీఐ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మండల మెజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జి.నాగేశ్వరరావు, వై.ముసలయ్య, ఎం.పృథ్వి, సీహెచ్‌ ప్రసాద్‌, బాబీ, రాజేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement