సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి.. సివిల్స్‌ లక్ష్యంతోనే ముందుకు

Sakshi Interview On Bhimavaram Deputy Collector Palaparthi John Irvine

సాక్షి, భీమవరం: సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమేగా లక్ష్యంగా పనిచేస్తానని గ్రూప్‌–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన భీమవరం పట్టణానికి చెందిన పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌(ఏసీఐఓ)గా పనిచేస్తున్న ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. నేరుగా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో  2009లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చినా వదులుకున్నానని, సివిల్స్‌ లక్ష్యంతోనే ముందుకు సాగానని చెప్పారు.

 

సాక్షి:  గ్రూప్‌–1కు ప్రిపేర్‌ కావడానికి స్ఫూర్తి ఎవరు? 
ఇర్విన్‌ : తాతయ్య జేసురత్నమే నా స్ఫూర్తి. ఆయన ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. ప్రజలకు నేరుగా సేవచేసే ఉద్యోగం సంపాదించాలని చెబుతుండేవారు. దాంతో సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ పడడంతో ఆ దిశగా ప్రయతి్నంచా. 

సాక్షి:  విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా సాగింది? 
ఇర్విన్‌:  విద్యాభ్యాసం భీమవరంలోనే సాగింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. కాలికట్‌ నిట్‌లో ఎంటెక్‌ చదివాను.
 
సాక్షి: గ్రూప్‌–1కి ఎలా ప్రిపేర్‌ అయ్యారు? 
ఇర్విన్‌: గ్రూప్‌–1 కోసం ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. మిత్రుల సహకారం, ఆన్‌లైన్‌లో చదవడమే. సివిల్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేశా. పరీక్ష బాగా రాసినా రిజల్ట్‌ రావడానికి ఆలస్యం కావడంతో 2015లో కేంద్ర నిఘా విభాగంలో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని గ్రూప్స్‌కు ఇంటర్వ్యూకు ప్రిపేర్‌ అయ్యాను.  

సాక్షి: తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? 
ఇర్విన్‌: మా నాన్న  బెల్తాజర్‌ ఉపాధ్యాయుడు, తల్లి మరియమ్మ గృహిణి. వారి ప్రోత్సహంతోనే ముందుకు సాగా. అపజయాలు ఎదురైనా వెన్నుతట్టి ముందుకు నడిపించారు.  

సాక్షి: మీ కుటుంబం గురించి? 
ఇర్విన్‌: భార్య కేథరినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆమె ప్రోత్సహం మరువలేనిది. ఒక కుమారుడు ఉన్నాడు. 

సాక్షి: గ్రూప్‌–1 అధికారిగా మీ ప్రాధామ్యాలు ఏంటి? 
ఇర్విన్‌: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వారి సక్రమంగా అందేలా కృషిచేస్తా. అదే నా మొదటి ప్రాధాన్యత.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top