ఒంటరిగా పోటీ చేసే ధైర్యం బాబుకు లేదు 

Sajjala Ramakrishna Reddy Takes On Chandra Babu Naidu - Sakshi

2019లోనే బాబును ప్రజలు క్విట్‌ చేశారు

సమన్వయంతోనే టీడీపీ, జనసేన నేతల పొత్తుల ప్రకటన

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు 2019 ఎన్నికల్లోనే రాష్ట్రం నుంచి క్విట్‌ చేశారు.. రాష్ట్రాన్ని రక్షించారు.. లేదంటే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉండేవి’ అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవన్నారు. టీడీపీ, జనసేన నేతలు సమన్వయంతోనే పొత్తులపై ప్రకటనలు చేస్తున్నారని, బీజేపీలోని చంద్రబాబు ఏజెంట్లు సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులు ఇదే రకమైన ప్రకటనలు చేస్తారని తెలిపారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసిరావాలని, దానికి  నాయకత్వం వహిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జనసేన, టీడీపీ, ఇంకొన్ని పక్షాలు విడిపోతేనే కదా.. మళ్లీ కలవడానికి అంటూ ఎద్దేవా చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటిస్తూనే.. తాను నాయకత్వం వహిస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వీటన్నింటినీ చూస్తే.. చంద్రబాబు మాట్లాడుతుంటే శవం మాట్లాడుతున్నట్లుగా ఉందంటూ దెప్పిపొడిచారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు పెట్టుకోవడం టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు విధానమన్నారు.

చంద్రబాబు ఇంకా రాచరికంలో ఉన్నామనుకుని ప్రజలను తేలిక భావంతో చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేస్తున్న లేనిపోని ఆరోపణలను ప్రజలు నమ్మడంలేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగానే బరిలోకి దిగి.. తిరుగులేని విజయం సాధించారని చెప్పారు. అధికారం చేపట్టాక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలు సాధించడమే సీఎం వైఎస్‌ జగన్‌కు నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు.

ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ అదే రీతిలో విజయం సాధిస్తామన్నారు. చంద్రబాబుకు పొత్తులతో వచ్చేది వాపేనని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజాబలంతో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం కొత్తగా పన్నులు వేయడంలేదని, ఆ పన్నులన్నీ  చంద్రబాబు సర్కారు వారసత్వంగా ఇచ్చిపోయినవేనని తెలిపారు. పన్నులపై వచ్చిన ప్రతి పైసాను ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నామని స్పష్టంచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మార్గదర్శకాల మేరకు తాను, విజయసాయిరెడ్డి సమన్వయంతో పనిచేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top