విద్యుత్‌ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం | RTC bus catches fire after hitting electric wires | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం

Apr 6 2026 5:03 AM | Updated on Apr 6 2026 5:03 AM

RTC bus catches fire after hitting electric wires

ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్‌  

వీరన్నగట్టుపల్లె సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం   

వేంపల్లె : వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె సమీపంలో 11 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్, కండక్టర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కదిరి డిపోకు చెందిన బస్సు వేంపల్లె నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కదిరి బయలుదేరింది. 

వీరన్నగట్టుపల్లె నుంచి కదిలిన బస్సుకి ఎదురుగా టిప్పర్‌ రావడంతో వేరే రోడ్డు గుండా వెళ్లేందుకు డ్రైవర్‌ ప్రయత్నించడంతో... ఆ ప్రాంతంలో కిందకి ఉన్న విద్యుత్‌ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కండక్టర్‌ లక్ష్మీ నారాయణమ్మ, డ్రైవర్‌ ఎస్‌ఎం వలిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. బస్సుకు వైర్లు తగలగానే విద్యుత్‌ లైన్‌ ట్రిప్‌ అవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.  

రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా..? 
ప్రస్తుతం చాగలమర్రి – రాయచోటి రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీరన్నగట్టుపల్లె వద్ద కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడంతో ఇడుపులపాయ రూరల్‌ ఫీడర్‌కు చెందిన 11 కేవీ హైటెన్సన్‌ విద్యుత్‌ వైర్లు బస్సుకు తగలడంతో దగ్ధమైందని పలువురు అంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే బస్సు దగ్ధమవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పనులు జరిగే ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించిన తర్వాత పనులు చేయాల్సి ఉండగా వాటిని తొలగించకుండానే కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. మరోవైపు ఇక్కడ ఒక్క సూచిక బోర్డూ ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డు పెట్టక పోవడంతోనే ఆర్టీసీ బస్సు డ్రెవర్‌ వేరే దారిలో వెళ్లేందుకు యత్నించడం వల్ల విద్యుత్‌ వైర్లు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  శనివారం రాత్రి కూడా పనులు చేసే సమయంలో టిప్పర్‌ తగిలి వైర్లు తెగిపోయాయని విద్యుత్‌ సిబ్బంది తెలిపారు. రోడ్డు పనులు చేసే సమయంలో ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందనే వాదన వినిపిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement