గ్రానైట్‌ దందాపై కన్నెర్ర

RT Officials On Vehicles Transporting Granite With Heavy Load - Sakshi

అధిక లోడుతో గ్రానైట్‌ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్‌ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి  గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. 

నెల్లూరు(టౌన్‌):  మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్‌ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్‌ లోడుతో ఉంటాయి. గ్రానైట్‌ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్‌ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్‌ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్‌ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 

అక్కడే కేసులు రాస్తే.. 
అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. 

దెబ్బతింటున్న రోడ్లు 
అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్‌ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్‌ వాహనాల వల్లే  రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు.

తనిఖీలు ముమ్మరం
జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్‌ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్‌ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం 
ఓవర్‌లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. 
– బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top