సాక్షి, విజయవాడ: విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తడంతో విజయవాడలో హైటెన్షన్ రోడ్డులో హంగామా జరిగింది. అర్ధరాత్రి ఇద్దరు యువకులు రోహిత్, ఓం.. థార్ జీపులతో రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు యువతి కారులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజినీరింగ్ విద్యార్థి. విజయవాడకు చెందిన బోల్లా ఓం.. తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్‌కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తాను పటమట ఆర్‌ఆర్ గార్డెన్‌లోని హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.
దీంతో, వారిద్దరూ తమ థార్ వాహనాలతో గురువారం రాత్రి హైటెన్షన్ రోడ్డుకు వెళ్లారు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. రోడ్డుపై సినిమా యాక్షన్ సీన్స్ తలపించేలా చేసిన హడావుడితో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీప్‌లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలకొట్టుకున్నారు.

అనంతరం, పరిస్థితి మరింత దారుణానికి దారి తీయడంతో స్థానికులు సమీపంలోని పటమట పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి జీప్‌ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. అయితే, గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో సదరు యువతి ఉన్నట్లు తెలిసింది.


