తెల్లారిన బతుకులు | Road Accident In Markapuram: Andhra pradesh | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Mar 27 2026 5:40 AM | Updated on Mar 27 2026 5:40 AM

Road Accident In Markapuram: Andhra pradesh

ఘోర ప్రమాదం.. మార్కాపురం వద్ద ప్రైవేట్‌ బస్సు దగ్ధం

14 మంది సజీవ దహనం 

మరమ్మతులకు గురైన స్టీరింగ్‌తో బస్సును నడుపుతుండగా ఘటన

సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఒక్కసారిగా బిగుసుకుపోయిన స్టీరింగ్‌

కంకర టిప్పర్‌ను ఢీకొని కాలి బూడిదైన ట్రావెల్స్‌ బస్సు 

అక్కడికక్కడే 13 మంది.. చికిత్స పొందుతూ మరొకరి మృతి 

ముద్దలుగా మారిన మృతదేహాలు.. 28 మందికి గాయాలు

ఎగిసిపడ్డ మంటలు, చుట్టుముట్టిన పొగతో ఉక్కిరి బిక్కిరి  

బస్సు డోరు, కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసిన ప్రయాణికులు 

స్పందించని డయల్‌ 100, 108.. 

మృతుల్లో పది మంది మార్కాపురం, నలుగురు నెల్లూరు జిల్లా వాసులు 

నా మనసును తీవ్రంగా కలిచివేసింది: వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.లక్ష సాయం: బూచేపల్లి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు, నెల్లూరు (టౌన్‌), కలిగిరి : తెల్లవారుజామున 5.30 గంటల సమయం.. బస్సు మార్కాపురం హైవే మీద దూసుకుపోతోంది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్‌ మొరాయించడంతో డ్రైవర్‌ తాత్కాలికంగా మరమ్మతులు చేసి బస్సును నడుపుతున్నాడు. రాయవరం మెడికల్‌ కాలేజీ, పలకల గనుల మధ్య కొండ మలుపు తిరుగుతోంది. అదే సమయంలో.. చీమకుర్తి నుంచి కంకర లోడు టిప్పర్‌ ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో అప్పటికే మరమ్మతులకు గురైన బస్సు స్టీరింగ్‌ జామ్‌ కావడంతో అదుపు తప్పింది.. వేగంగా వచ్చి టిప్పర్‌ మధ్యలో ఉన్న ఆయిల్‌ ట్యాంకును  ఢీ కొట్టింది. 

దీంతో వెలువడిన మంటలు క్షణాల్లో బస్సును అంటుకున్నాయి. మరోవైపు బస్సులో ఉన్న బ్యాటరీ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అగ్నికీలల్లో ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. పలువురు ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సు డోరు, కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. 13 మంది సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. బస్సు నుంచి దూకి 28 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. మాటలకందని ఈ  విషాదం అందరినీ కలిచివేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులోని పలక గనుల సమీపంలో గురువారం వేకువ జామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

కళ్లెదుటే కాలిపోతుంటే..
తండ్రి ఎదుటే కుమారుడు... భార్య కళ్లెదుటే భర్త, చిన్నారి.. అగ్ని కీలలకు ఆహుతి కావడంతో బాధితులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. కళ్లెదుట తమవారు సజీవ దహనమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో విలవిల్లాడారు. ఘటనా ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

స్టీరింగ్‌కు తాత్కాలిక మరమ్మతులు చేసి..
బస్సు తొలుత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వద్దకు రాగానే స్టీరింగ్‌ బేరింగ్‌ చెడిపోయింది. దాంతో బస్సును సుమారు గంటసేపు అక్కడే ఆపి తాత్కాలిక మరమ్మతులు చేశారు. అనంతరం  బస్సు రాయవరం పలకల గనులు దాటి కొండ మలుపు వద్దకు రాగానే చీమకుర్తి నుంచి వస్తున్న కంకర లోడు టిప్పర్‌ ఎదురొచి్చంది. దాంతో బస్సు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో అప్పటికే మరమ్మతులకు గురైన స్టీరింగ్‌ బిగుసుకుపోయి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?
బస్సు కండీషన్‌పై ప్రయాణికులు, డ్రైవర్‌ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బస్సు కండీషన్‌ సరిగా లేదని డ్రైవర్‌ అంగీకరించినట్లు కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. అనంతరం కొద్దిసేపటికే మార్కాపురం సమీపంలో ఈ ఘోరం జరిగిపోయింది. 

జగిత్యాల నుంచి కలిగిరికి..
ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి వెళుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బయలుదేరింది. జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూరు, భీంగల్, కామారెడ్డి, రామాయంపేట, మేడ్చల్‌లో ప్రయాణికులు ఎక్కారు.

మొత్తం 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో మాచర్లలో ముగ్గురు ప్రయాణికులు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. ట్రావెల్స్‌ బస్సు అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ అయింది. యార్లగడ్డ కోటేశ్వరరావు, తండ్రి గణపతిరావు, కొమరోలు, కృష్ణా జిల్లా అడ్రసు పేరుతో ఉంది. బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం తిప్ప వద్ద ఉన్న ట్రావెల్స్‌ కార్యాలయాన్ని మూసివేశారు. 

మృతుల్లో చిన్నారులు, మహిళలు...
ఈ ఘోర ప్రమాదంలో ముక్కు పచ్చలారని 5 నెలల చిన్నారి, ఆరేళ్ల బాలిక, ఐదుగురు మహిళలు, మరో ఏడుగురు పురుషులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. తేరుకునే సమయం కూడా లేకపోవడంతో ఊపిరాడక మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కాగా,  బస్సు డ్రైవరు పందెం యువరాజ్‌ ప్రమాదం జరిగిన వెంటనే పారిపోతూ పొదల్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం 8.30 గంటలకు స్థానికులు గుర్తించారు.

అనంతరం  అతన్ని అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. టిప్పర్‌ యజమాని అశోక్‌ రెండు నెలల క్రితమే వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తొలుత మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 12 మంది క్షతగాత్రులను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.  

పూర్తిగా కాలి, ముద్దలుగా మారి...
పోలీసులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకునే లోపే బస్సు కాలి బూడిద కావడంతో ఇనుప కడ్డీలు మాత్రమే మిగిలాయి. బొగ్గులా మారిన మాంసపు ముద్దలు కనిపించాయి. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అతి కష్టం మీద 14 మృతదేహాలను వెలికి తీశారు. గుర్తు పట్టలేని విధంగా మసి బొగ్గులా మారిన మృతదేహాలు కంటనీరు పెట్టించాయి. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు.  కాగా, బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గురువారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

స్పందించని డయల్‌ 100, 108
ప్రమాదం జరిగిన వెంటనే డయల్‌ 100కు అనేక సార్లు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించలేదని ఓ యువతి వాపోయింది. 20 సార్లు ఫోన్‌ చేసిన తరువాత 108 స్పందించినట్లు పేర్కొంది. బాధితులను పరామర్శించేందుకు మార్కాపురం జీజీహెచ్‌కు వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట ఈ విషయాన్ని వెల్లడించి రోదించింది.

బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా
సాక్షి, న్యూఢిల్లీ: మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు.  

నా మనసును తీవ్రంగా కలచివేసింది
బస్సు ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం జరిగిన ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దారుణ ఘటనపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడినవారికి ప్రత్యేక వైద్య బృందాలతో అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.    

మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం
పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
మార్కాపురం: రాయవరం పలకల గనుల వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించిన అనంతరం స్థానిక జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘‘గత ఏడాది అక్టోబరులో కర్నూలులో కూడా ఇలాంటి బస్సు దుర్ఘటనే జరిగింది. మళ్లీ అటువంటి దుర్ఘటన మార్కాపురంలో జరగడం దురదృష్టకరం’’ అని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

మార్కాపురం జీజీహెచ్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్‌ కాలేజీని ఇక్కడ నిర్మించి ఉంటే నాణ్యమైన వైద్యం అందేదని, ఒంగోలుకు తరలించాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడే మెడికల్‌ కాలేజీని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

మృతుల వివరాలు
1.    అంబటి అనిల్‌ (27) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)
2.    అంబటి లియో (5 నెలలు) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)
3.    తమ్మిశెట్టి పిచ్చమ్మ (80)  (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)
4.    తమ్మిశెట్టి రుక్మిణి (26) (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)
5.    ఉప్పు రమాదేవి (కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి)
6.    బండారు పద్మ (28) (కనిగిరి)
7.    దేవేండ్ల రామయ్య (బీసీ కాలనీ, కనిగిరి)
8.    పొదిలి మహేంద్ర (వెలిగండ్ల మండలం చౌడవరం)
9.    నర్సింగ్‌ ప్రభావతి (36) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)
10.  నర్సింగ్‌ చైత్ర (6) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)
11.  ముత్తంగి వెంకటేశ్వర్లు(45) (ఉదయగిరి మండలం దాసరిపల్లి, నెల్లూరు జిల్లా)
12.  కత్తి జయరాములు (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా)
13.  ఆత్మకూరు చిన్నా (45) (కలిగిరి మండలం బొమ్మరాజుపల్లి, నెల్లూరు జిల్లా)
14.  చిలకపాటి వెంకటేష్‌    (కొండాపూర్‌ మండలం గొట్టిగుండాల, నెల్లూరు జిల్లా)

సొంతూళ్లో వేడుకల కోసం బయలుదేరి.. 
జగిత్యాలక్రైం/రాయికల్‌/రుద్రంగి: జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్‌ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచి్చన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్రీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో మేస్త్రీ వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్‌ శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్‌లో బుధవారం సాయంత్రం బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి, దేవండ్ల రామయ్య మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు.  

కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం 
మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్‌తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే..  రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్‌ చెప్పాడు.  

చిట్టీ డబ్బులు కట్టేందుకు.. : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్‌ అయోధ్యలో పోలయ్య తాపీమేస్త్రీ వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేలుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచి్చందని  కుటుంబసభ్యులు వాపోయారు.

మృతుల్లో తండ్రీకొడుకులు
కామారెడ్డి క్రైం: మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన అనిల్‌  హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతను భార్య సౌధ, కుమారుడు లియో (5 నెలలు)తో కలిసి మూడు రోజుల క్రితం కామారెడ్డికి బంధువుల ఇంటికి వచ్చారు. కుమారుడు లియోకు కేశఖండనం చేయించాలని స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. వారితోపాటు సమీప బంధువులిద్దరితో కలిసి మార్కాపురంకు బుధవారం రాత్రి కామారెడ్డి నుంచి బయలుదేరారు. బస్సులో మంటలు  రేగినప్పుడు అనిల్‌ తన భార్యను కిటికీలోంచి బయటకు తోసివేసినట్లు తెలిసింది. ఆ క్రమంలో కిందపడిపోయిన కుమారుడిని వెతికి తెచ్చేలోపు మంటలు వ్యాపించడంతో ఇద్దరూ చనిపోయారని బంధువులు తెలిపారు. అనిల్, అతని కుమారుడు మృతి చెందారు.

ఇంటికి వెళ్తూ.. 
లక్ష్మణచాంద: ఏపీ ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బండారు వెంకటరమణయ్య, బండారు పద్మ దంపతులు. నాలుగేళ్ల క్రితం, మణి, వెంకట్రావ్‌ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి వలస వచ్చి తాపీమేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం స్వగ్రామం అంకభూపాలపురం వెళ్లడానికి బండారు పద్మ, మణి, మణి బావ కుమారుడైన రోహాన్‌ ఆర్మూర్‌ నుంచి జగిత్యాల వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్‌ బస్‌లో బయల్దేరారు. బస్సు కంకర టిప్పర్‌ను ఢీకొని మంటలు చేలరేగడంతో పద్మ  మంటల్లోనే కాలి బూడిదైంది. మణి, రోహాన్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మణి ప్రస్తుతం కోమాలో ఉంది.  

తిరుగు ప్రయాణంలో
సిరికొండ: బస్సులో ప్రయా ణిస్తున్న వారు ఉపాధి నిమిత్తం నెల రోజుల కిందట నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలకు వచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల కోసం వారు బుధ వారం రాత్రి వారి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్కాపురం జిల్లా ఎలగండ్ల మండలం చౌడారం గ్రామానికి చెందిన మహేంద్ర, అబ్రహం, ప్రవీన్‌.. గడ్కోల్‌ గ్రామంలో రమణయ్య మేస్త్రీ వద్ద పనులకు వచ్చారు. వీరిలో మహేంద్ర(28) చనిపోయాడు.

సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి 
సాక్షి, హైదరాబాద్‌: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం.. పలువురు తీవ్ర గాయాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు నిర్మల్‌ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.  

పలువురి సంతాపం 
బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు కోరారు. రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రులు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ డా.సి.అంజిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement