
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని 40 మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అనకాపల్లిలో 11, విజయనగరంలో 10, శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే రాష్ట్రంలోని మరో 78 మండలాలపై కూడా భానుడు తన ప్రతాపం చూపించాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1, కర్నూలు జిల్లా నన్నూర్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం కూడా ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.