క్రూర జంతువులకే సవాల్‌ విసిరే హనీ బ్యాడ్జర్‌! | Rare Honey Badger Spotted In Papikonda Sanctuary | Sakshi
Sakshi News home page

క్రూర జంతువులకే సవాల్‌ విసిరే హనీ బ్యాడ్జర్‌!

May 23 2026 9:19 AM | Updated on May 23 2026 9:24 AM

Rare Honey Badger Spotted In Papikonda Sanctuary

ఏలూరు జిల్లా: పాపికొండల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో హనీ బ్యాడ్జర్‌ ఒకటి. ఈ జంతువు ఎత్తు  కేవలం 12 అంగుళాలు. హనీ బ్యాడ్జర్‌ పంజాకు గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. తల నుంచి వరకు తెలుపు, తెలుపు గీతలతో మందపాటి, దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉంటాయి. చూసేందుకు ఎలుగుబంటిలా పొట్టిగా ఉంటుంది. పౌరుషంలో ఈ హనీ బ్యాడ్జర్‌కి  మరో వన్యప్రాణి  సాటిరాదు.  

పులినైనా ఎదురించ గల ధైర్యశాలి 
హనీ బ్యాడ్జర్‌లు చాలా ధైర్యం కలిగిన వన్యప్రాణులు. హనీ బ్యాడ్జర్‌  చర్మం ఎలాస్టిక్‌గా ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి.  అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు. పులి, చిరుత, కొండ చిలువతో పాటు ఏ జంతువుతోనైనా ఎదురించి పోరాడే ధైర్య శాలి. పాము విషం కూడా ఈ హనీ బ్యాడ్జర్‌లను ఏమి చేయలేదు. వాసన పసిగట్టి  ఆహారాన్ని  సేకరించడంలో స్నీపర్‌ డాగ్‌ను మించిన నైపుణ్యాన్ని హనీ బ్యాడ్జర్స్‌ కనబరుస్తుంటాయి. ప్రపంచంలోనే భయం లేని జంతువు ఉందంటే అది హనీ బ్యాడ్జర్‌ ఒక్కటే అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ హనీ బ్యాడ్జర్‌ జీవిత కాలం కేవలం ఏడేళ్లు మాత్రమే అని అధికారులు వివరిస్తున్నారు.  

తేనె తుట్టెల్లోని లార్వా అంటే ఇష్టం 
హనీ బ్యాడ్జర్‌కు అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనె టీగ లార్వా అంటే ఎంతో ఇష్టం. తేనెటీగ లార్వా వాసనను పసిగట్టి ఎంతో ఇష్టంగా తింటాయి. అందువల్లే ఈ జంతువును హనీ బ్యాడ్జర్‌ అని పిలుస్తారు. తేనెటీగ లార్వాతో పాటు కీటకాలు, కుందేళ్లును ఆహారంగా తింటాయి. ఈ హనీ బ్యాడ్జర్‌లు మాంసాహారులు. వీటి ఆహారంలో 25 శాతం పాములే ఉంటాయి. పాములు ఈ జంతువుల కంట పడితే వేటాడి వెంటాడి చంపి మరి తినేంత వరకు వెనక్కి వెళ్లవు. 

పాపికొండల్లో సంచారం 
అరుదైన హనీ బ్యాడ్జర్‌ల సంచారం పాపికొండల్లో  ఎక్కువగానే ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వివరిస్తున్నారు. అభయారణ్యంలో సుమారు 1200 పైగా హనీ బ్యాడ్జర్లు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమేరాలకు హనీ బ్యాడ్జర్‌లు జాడ చిక్కినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వీటి సంతతి కూడా అధికంగా పెరుగుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement