
కొల్లేరులో వలలకు అరుదైన పక్షులు బలి
నాటు తుపాకులకు ప్రాణాలు హరీ
గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు
చేతులెత్తేసిన అటవీశాఖ అధికారులు
ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన కొల్లేరు సరస్సు.. పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే విహంగాల స్వర్గధామం. కానీ ఇప్పుడు ఆ స్వర్గంలో మరణమృదంగం మోగుతోంది. అతిథులను ఆత్మీయంగా ఆదరించాల్సిన మన సంస్కృతి సూక్తిని విస్మరించిన వేటగాళ్లు, విదేశీ పక్షులపై విరుచుకుపడుతున్నారు.
తుపాకీ గుండ్లతో మూగజీవాల గుండెలను చీల్చేస్తూ, వలల ఉచ్చులతో ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అటవీ అభయారణ్య చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితమైపోయాయి. నియంత్రించాల్సిన అధికారుల కళ్లముందే వేటగాళ్ల దౌర్జన్యం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో మరింత బరితెగించి కొల్లేరు ఒడిలో సేదతీరుతున్న పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. – కైకలూరు
ఆక్వా చెరువులపై వాలినా ఆయువు తీరినట్లే...
ఆక్వా చెరువులపై వాలిన అరుదైన పక్షి జాతులు సైతం వేటగాళ్ల నాటు తుపాకులకు బలవుతుండడం సమస్యకు మరో కోణం. రాష్ట్రంలో 5.75లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాలుగా ఉంది. ఎక్కువ విస్తీర్ణం కలిగిన చేపల రైతులు సాగు ప్రారంభంలో చేప పిల్లలను పక్షులు తినకుండా నాటు తుపాకుల కలిగి వేటగాళ్లును నియమించుకుంటారు.
ఇందుకోసం తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి వచ్చిన దాదాపు 150 కుటుంబాలు కైకలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తుపాకితో ఒక్క పక్షిని చంపితే వీరికి రూ.200 నుంచి రూ.300 వరకూ పనికి తీసుకెళ్లిన చెరువు రైతులు చెల్లించాలి.
ఈ క్రమంలో కొల్లేరులో సంచరించే పక్షులు చెరువులపై వాలితే వేటగాళ్లు కాల్చేస్తున్నారు. చేపలు పెద్దవైన తర్వాత సైతం వేటగాళ్లు తమ పక్షుల వేటను కొనసాగిస్తుండడం గమనార్హం. నాటు తుపాకులకు పేలే మందు తయారీ క్రమంలో అనేక మంది వేటగాళ్లు మరణించిన ఘటనలు కొల్లేరు ప్రాంతంలో చోటుచేసుకోవడం గమనార్హం.
అక్రమ వేటకు ఎన్నో ఆనవాళ్లు..
గుడివాకలంక, నిడమర్రు, అడవి కొలును, శృంగవరప్పాడుతో పాటు నడి కొల్లేరులోని అనేక ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు.
» ఆగస్టు 29న ఏలూరు జిల్లా గుడివాకలంక వద్ద కొల్లేరు పక్షులను వేటాడి తెస్తున్న వ్యక్తిని ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు. కైకలూరు మండలం కొల్లేటికోట ప్రాంతంలో వేటాడానని అతను చెప్పాడు. ఇదే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం బతికి ఉన్న పక్షుల తీసుకెళుతున్న ఒకరిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మేజి్రస్టేట్ తీర్పుతో పక్షులను వదిలేశారు.
» సెప్టెంబర్ 4న నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్‌లో విక్రయానికి ఉంచిన 13 మృతి చెందిన పక్షులను, ఏడుగురు వేటగాళ్లను, 3 నాటు తుపాకులను భీమవరం పారెస్టు సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు.
» కొద్దిరోజుల క్రితం వేటగాళ్లు గుళికలతో చంపిన గ్లోసి ఐబీస్ కొల్లేరు పక్షుల ఫొటోలు సామాజిక మాద్యమాల్లో ప్రత్యేక్షమయ్యాయి.
» ఇవే కాకుండా కొల్లేరులో పక్షుల వేటలో వెలుగు చూడని అనేక ఘటనలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి.
నిఘా ముమ్మరం
కొల్లేరు ప్రాంతంలో పక్షుల వేటగాళ్లపై నిఘాను ముమ్మరం చేశాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వేటాడినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా, అభయారణ్యంలో ప్రవేశించినా నేరంగా పరిగణిస్తాం. రెండేళ్లు జైలు, రూ.20 వేల జరిమానాతో పాటు రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. నాటు తుపాకులతో అభయారణ్యంలో ప్రవేశం నేరం. – కె.రామలింగాచార్యులు, జిల్లా ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఏలూరు
సమస్యలు
» వేటగాళ్లు 30 అడుగుల ఎత్తులో చిక్కు వలలు కడుతున్నారు
» గుళికలు ఎరగా పెడుతున్నారు
» పక్షులను పట్టి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు
» జత పక్షులు సైజు బట్టి రూ.600-1,000 శ్రేణిలో విక్రయం
» వేటగాళ్లపై గ్రామ పెద్దలు జరిమానాలు విధిస్తామన్నా ఫలితం లేదు.
» పూర్వం వేటాడిన పక్షులను బహిరంగంగానే కొన్ని జాగ్రత్తలతో విక్రయించేవారు.
» ఇప్పుడు నాయకుల సిఫార్సుల ఆధారంగా భారీగా విక్రయాలు సాగిపోతున్నాయి.
వేటకు గురవుతున్న ప్రధాన పక్షులు
» పర్పూల్ శాంఫన్ (కొండింగాయి)
» కామన్ మోర్‌హెన్ (జమ్ముకోడి)
» కామన్ కూట్ (నామాల కోడి)
» టీల్ (పరజా)
» గ్లోసీ ఐబీస్ (నల్ల కంకణాల పిట్ట)
» విజిటింగ్ టీల్ (సిలువ బాతులు)
» గ్రేహెరాన్ (నారాయణ పక్షి)
» కార్బోరెంట్ (నీటి కాకులు)
సరస్సు ముఖ్యాంశాలు..
ప్రాంతం: 901 చ.కి.మీ.
విస్తీర్ణం: 2,22,300 ఎకరాలు
అభయారణ్యం: 77,138 ఎకరాలు (9 మండలాలు)
గ్రామాలు: 122
జనాభా: 3.50 లక్షలు
విహరించే పక్షి జాతులు: 182
వలస పక్షులు: ప్రత్యేక ఆకర్షణ