రామాయపట్నం పోర్టు
దాదాపు రూ.ఐదు వేల కోట్ల విలువైన పోర్టు అప్పనంగా అప్పగింత
రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం.. అది కూడా ఇప్పుడు సగం కడితే చాలు
పోర్టు పనుల్లో మిగిలిపోయిన 5 శాతం కూడా ప్రభుత్వమే పూర్తి చేసే ఇచ్చేలా షరతు
పోర్టు కోసం తీసుకున్న రూ.2,079 కోట్లు అప్పు తీర్చాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే
తొలి దశలో 850.79 ఎకరాల్లో రామాయపట్నంను సిద్ధం చేసిన వైఎస్ జగన్ సర్కార్
గత ప్రభుత్వంలోనే 95 శాతానికిపైగా పోర్టు పనులు పూర్తి
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రైవేట్ చేతుల్లో పెడుతున్న బాబు సర్కారు
పోర్టు విస్తరణకు అవసరమైన భూమి సైతం ఎకరం కేవలం రూపాయికే
50 ఏళ్లపాటు నిర్వహించుకునేలా ప్రైవేటు సంస్థకు ధారాదత్తం
నామమాత్రంగా కేవలం 12 శాతం ఈక్విటీ.. యాజమాన్య హక్కులన్నీ ప్రైవేట్ సంస్థవే
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ ఖాతాలో తాజాగా రామాయపట్నం పోర్టు చేరిపోయింది. గత ప్రభుత్వ హయాంలోనే 95 శా తానికిపైగా పూర్తయిన పోర్టును అడ్డగోలుగా ప్రైవేట్ చేతికి అప్పగిస్తోంది. దాదాపు రూ.ఐదు వేల కోట్ల విలువైన ఈ పోర్టును అత్యంత కారుచౌకగా రూ.1,500 కోట్లకే అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలనే షరతుతో అప్పనంగా ఇచ్చేస్తోంది. అనంతరం పోర్టు విస్తరణకు కేవలం ఎకరం రూపాయికే అత్యంత విలువైన భూములను కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది. ఈమేరకు రామాయపట్నంపోర్టును ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు తాజాగా బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రులు.. ఫిషింగ్ హార్బర్లు.. పోర్టులు.. బీమా పేరుతో ఆరోగ్యశ్రీ సేవలు..! ఇలా అన్నింటినీ కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించి చంద్రబాబు సర్కారు దోచి పెడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సృష్టించిన రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులన్నీ ప్రైవేట్‌కు పప్పు బెల్లాలకు అప్పగిస్తూ ఖజానాకు గండి కొడుతోంది. కొత్తగా సంపద సృష్టించకపోగా గత ప్రభుత్వం సమకూర్చిన విలువైన ఆస్తులను సైతం ఊడ్చేస్తోంది.
50 ఏళ్ల దీర్ఘకాలానికి..
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను ప్రారంభించడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను కూడా సమకూర్చింది. గత ప్రభుత్వంలోనే 95 శాతానికిపైగా పనులు పూర్తై వాణిజ్య కార్యకలాపాలు సైతం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు తిలోదకాలిస్తోంది. పూర్తయిన తొలి దశ పోర్టును నిర్వహించడంతో పాటు పోర్టు విస్తరణ పనుల కోసం 30 ఏళ్ల దీర్ఘకాలానికి ఆపైన మరో 20 ఏళ్లు మొత్తం 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్నారు. తొలిదశలో మొత్తం 850.79 ఎకరాల్లో రూ.4,929.39 కోట్లతో (భూమి విలువతో కలిపి) గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టును కేవలం రూ.1,500 కోట్ల అప్‌ఫ్రంట్ ప్రీమియం ధరకు ఇచ్చేస్తున్నట్లు టెండర్ డాక్యుమెంట్‌లో చంద్రబాబు సర్కారు పేర్కొంది.
అదికూడా తొలుత రూ.750 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తం పోర్టు వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఇస్తే సరిపోతుందంటూ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనూ పోర్టు పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఇక మిగిలిన కొద్దిపాటి పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం పూర్తి చేయకుంటే ఆ విలువను అప్ ఫ్రంట్ విలువ నుంచి తగ్గించుకుంటారు. దీంతో రూ.1,500 కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు పూర్తిగా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. నాలుగు బెర్తులతో 34 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న పోర్టును ఇలా అప్పనంగా ఇచ్చేస్తుండటం చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. బ్రేక్ వాటర్ పనులు, బెర్తులు, భవనాలు అన్నీ పూర్తయ్యి.. రోడ్డు, రైల్వే కనెక్టివిటీ కూడా కలిగిన రామాయపట్నం పోర్టును కారుచౌకగా కట్టబెడుతుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పోర్టును అభివృద్ధి చేయడం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న రుణం రూ.2,079 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.750 కోట్లు చేతిలో పట్టుకొని వస్తే అన్ని హంగులతో ఉన్న పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. 
పోర్టు విస్తరణకు ఎకరం ఏడాదికి రూపాయి లీజుకే కట్టబెడతామని, పోర్టును రూ.1500 కోట్లకే అప్పగిస్తామని, అదీ ఇప్పుడు సగం చెల్లిస్తే చాలు అంటూ టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలు
బంగారు బాతు లాంటి పోర్టు బలి!
పోర్టు ఆదాయంలో ఎవరు ఎక్కువ శాతం వాటా ఇస్తారో వారికి ఈ పోర్టును అప్పగించనున్నట్లు బిడ్‌లో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇప్పుడు ప్రైవేటు సంస్థ చూపించే మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే రాష్ట్ర ఖజానాకు చిల్లు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు వివిధ కార్యకలాపాల కోసం ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేసి ఆదాయాన్ని దారి మళ్లించేస్తాయని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటు పబ్లిక్ పార్ట్‌నర్íÙప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసిన పోర్టుల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో గతంలో ఇలాంటి మోసాలు వెలుగు చూసిన విషయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు గుర్తు చేశారు. ఒకసారి దీర్ఘకాలిక ఒప్పందం కుదిరిన తర్వాత నిబంధనల్లో మార్పుకు వీలుండదని, ప్రైవేటు సంస్థలు నిర్ణయించే టారీఫ్‌లపై కలగచేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండదని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు సర్కా రు తీరు చూస్తుంటే బంగారు గుడ్లు పెట్టే బాతు కథ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దురాశతో బాతును చంపినట్లుగా కేవలం రూ.1,500 కోట్ల కోసం రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చే పోర్టును బలి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరం రూపాయికే...
రామాయపట్నం పోర్టును 850.79 ఎకరాల్లో అభివృద్ధి చేసినందుకుగానూ కేవలం 12 శాతం ఈక్విటీని చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఇంత తక్కువ ఈక్విటీ కలిగి ఉండటం వల్ల ఈ పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. అంతేకాదు.. మలిదశలో పోర్టును అభివృద్ధి చేసేందుకు ఎకరం ఏడాదికి రూపాయి లీజు చొప్పున కావాల్సినంత భూమిని ఇచ్చేస్తామని టెండరు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సుమారు 2,000 ఎకరాలను సమీకరించింది. రామాయపట్నం పోర్టు పక్కనే బీపీసీఎల్ లాంటి అతిపెద్ద రిఫైనరీ రావడమే కాకుండా ఇప్పటికే ఈ పోర్టులో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఒక బెర్తు తీసుకుంది. పక్కనే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అతిపెద్ద భారీ సోలార్ ప్యానల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇన్ని హంగులున్న పోర్టును చంద్రబాబు సర్కారు ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


