రైళ్లలో రాయితీలు కొందరికే | Sakshi
Sakshi News home page

రైళ్లలో రాయితీలు కొందరికే

Published Thu, Jul 14 2022 3:51 AM

Railway Department Counter in Andhra Pradesh High Court - Sakshi

సాక్షి, అమరావతి: రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీని పునరుద్ధరించకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ హైకోర్టుకు నివేదించింది. రాయితీలు కల్పించిన మొత్తం 53 కేటగిరీల్లో దివ్యాంగులు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులకు మినహా మిగిలిన వారెవరికీ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని పేర్కొంది. కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వృద్ధుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని, తమ చర్యల ద్వారా ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదని నివేదించింది.

కరోనా విషయంలో తదుపరి వైద్యపరమైన సూచనలు, సలహాలు అందేవరకు రాయితీ పునరుద్ధరణ సాధ్యం కాదని వెల్లడించింది. రాయితీని పొడిగించకపోవడం ఎంతమాత్రం అన్యాయం, ఏకపక్షం, వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని సవరించాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వృద్ధులకు రాయితీని పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టి వేయాలని రైల్వే శాఖ అభ్యర్థించింది. 

రాయితీ పునరుద్ధరణ కోసం పిల్‌.. 
వృద్ధులకు రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో కోవిడ్‌ సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్‌ కుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం ఆదేశాల మేరకు రైల్వేశాఖ తరఫున దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ బీడీ క్రిష్టోఫర్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. రైలు ప్రయాణికులకు రాయితీలు కల్పించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ విధానపరమైన నిర్ణయమని కౌంటర్‌లో  పేర్కొన్నారు. రాయితీల పునరుద్ధరణ విషయంలో రైల్వే బోర్డు చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.

రిప్లై దాఖలుకు గడువిచ్చిన ధర్మాసనం..
జీఎన్‌ కుమార్‌ దాఖలు చేసిన పిల్‌ బుధవారం మరోసారి విచారణకు రాగా.. రాయితీలు పునరుద్ధరించకపోవడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ నివేదించారు. రైల్వేశాఖ కౌంటర్‌కు సమాధానమిచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement