ప్రత్యేక జాబ్‌చార్ట్ ప్రకటించాలి
తమ సబ్జెక్టులో మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలి
ఎంపీఎస్‌లలో ఖాళీలు భర్తీ చేయాలి
గ్రేడ్–3 హెచ్‌ఎంలుగా గుర్తించాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీఎస్‌హెచ్‌ఎంల ఫోరం
27 డిమాండ్ల కరపత్రం విడుదల
12 నుంచి 18 వరకు వినతి పత్రాల సమర్పణ
సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ పీఎస్‌హెచ్‌ఎంలు గళమెత్తారు. పీఎస్‌హెచ్‌ఎంలకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని, వారివారి సబ్జెక్టులో మాత్రమే విద్యా బోధనకు వీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఏపీపీఎస్‌హెచ్‌ఎం ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచారు.
ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా రూపొందించిన ఈ పోస్టులకు ఎలాంటి జాబ్‌చార్ట్ లేదని, తమ పరిధి ఏంటో తమకే తెలియడం లేదని వాపోయారు. హైసూ్కళ్లలో నడుస్తున్న ప్రాథమిక తరగతులకు ప్రత్యేక డైస్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఎస్‌లలో ఉన్న ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని, తమను గ్రేడ్–3 హెచ్‌ఎంలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ టీచర్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. అసెస్‌మెంట్ పుస్తకాలపై ప్రభుత్వం, విద్యాశాఖ పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పీఎస్ హెచ్‌ఎంల సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా పీఎస్ హెచ్‌ఎంల ఫోరం 27 సమస్యలతో కూడిన డిమాండ్ల కరపత్రాన్ని విడుదల చేశారు. సమస్యలపై ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని ఫోరం నిర్ణయించినట్టు అధ్యక్షుడు తెలిపారు. పరిష్కారం కాకపోతే ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలని తీర్మానించినట్టు వివరించారు. కార్యక్రమంలో 13 ఉమ్మడి జిల్లాల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.


