తిరియాటి.. సదవాటి.. రాసాటి!

Primary education for Tribals in Koya languages - Sakshi

కోయ భాషల్లోనే గిరిపుత్రులకు ప్రాథమిక విద్యా బోధన

లిపిలేని భాషలకు ఊపిరి

8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో అమలు

తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలు కోయ భాషల్లో రూపకల్పన

కేంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజనులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది.

6 భాషలు.. 920 పాఠశాలల్లో అమలు
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు.  అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది.
చింతూరు మండలం చట్టి పాఠశాలలో కోయ భాషలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు 

ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ), శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర), విశాఖపట్నం జిల్లాలో (కొండ, కువి, ఆదివాసీ), కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1 నుంచి 3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.

యవ్వ.. ఇయ్య భాషలోనే..
కోయ భాషలో అమ్మను యవ్వ అని.. నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా.. అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని.. కోడి పుంజును గొగ్గోడు అని.. పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమాణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా), బాత్‌ కుసిరి (ఏం కూర), దెమ్ము (పడుకో), ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతోపాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. 

ఇతర భాషలపై పట్టు సాధించేందుకే..
ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొందించారు. మాతృభాషలో బోధన వలన డ్రాపౌట్లు కూడా తగ్గుతాయి.
– ఆకుల వెంకటరమణ, పీవో, ఐటీడీఏ, చింతూరు

మాతృభాషా బోధన మంచి నిర్ణయం
మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి.        
– ముర్రం దూలయ్య, ఉపాధ్యాయుడు, జీపీఎస్‌ పాఠశాల, చట్టి, చింతూరు మండలం

కోయభాషలో బోధన ఎంతో అవసరం
కొత్తగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయభాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబుతుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది.
– తుర్రం బాయమ్మ, గిరిజన విద్యార్థి తల్లి, చింతూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top