Priest Dies Of Snake Bite In Krishna District - Sakshi
Sakshi News home page

పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..

Published Mon, Sep 26 2022 9:27 AM

Priest dies of Snake Bite in Kruthivennu Krishna District - Sakshi

కృత్తివెను (కృష్ణా జిల్లా): పాము కాటుకు పురోహితుడు బలైన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు (48) పౌరోహిత్యం, వాస్తుశాస్త్రం చెబుతూ జీవనం సాగిస్తారు. శనివారం మధ్యాహ్నం పీతలావ గ్రామంలోని ఓ రొయ్యల మేత షెడ్డులో పాము ఉందన్న స్థానికుల సమాచారంతో నాగబాబు వెళ్లాడు. తాచుపామును పట్టుకున్న వెంటనే ఆయన చేతిపై రెండుమార్లు కాటు వేసింది. అయినప్పటికీ పామును విడిచిపెట్టకుండా సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు.

తరువాత తనకు తెలిసిన సొంత వైద్యం చేసుకుని వెంటనే మచిలీపట్నంలోని హాస్పిటల్‌కు వెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఆయన మృతదేహాన్ని వేలాది మంది సందర్శించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కాటు వేసినా కానీ దానికి ఎటువంటి హాని చేయకుండా సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టడం ఆయనకు మూగజీవాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ప్రజలు చర్చించుకున్నారు.

నాగబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు తండ్రి కొండూరి గోపాలకృష్ణ శాస్త్రి ఎన్నో ఏళ్లుగా పౌరోహిత్యం చేసుకుంటూ, పాము, తేలు కాటుకు నాటు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వీరు పాముకాటుకు విరుగుడు వేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. శాస్త్రి మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు నాగబాబు పాముకాటుకు మంత్రం వేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన పాముకాటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది.  

చదవండి: (మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్‌ పరామర్శ)

Advertisement
Advertisement