
జనవరిలో గుర్తింపు మూల్యాంకనానికి వర్సిటీని సందర్శించిన ఎన్‌బీఏ బృందం
సహకరించని అధికారులు... అవసరమైన పత్రాల సమర్పణలో జాప్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. రాజకీయ అనాలోచిత నిర్ణయాలతో పూర్వ వైభవాన్ని కోల్పోతూ వర్సిటీ పరువు గంగపాలు అవుతోంది. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న యూనివర్సిటీపై ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్’ (ఎన్‌బీఏ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు మూల్యాంకనం కోసం వచ్చిన ఎన్‌బీఏ నిపుణుల బృందానికి ఏయూ అధికారులు సహకరించలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అంతేకాక.. రెండు కవర్లతో బహుమతులు ఎర వేసినట్లు ఆరోపిస్తూ లేఖ రాయడం ఏయూలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఏయూ పాలకులు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు.
సహకరించని ఏయూ..
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (స్వయం ప్రతిపత్తి) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేయగా.. ఎన్‌బీఏ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి 17 నుంచి 19 వరకు ఏయూని సందర్శించింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజిలో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు విద్యార్థుల వివరాలు, ఫీజులు, ఫ్యాకల్టీ, ఇతర వివరాలను పరిశీలించే ప్రయత్నం చేసింది.
అయితే, ఏయూ అధికారులు బృందం సభ్యులకు సరైన పత్రాలు సమర్పించలేదు. దీంతో.. ఎన్‌బీఏ బృందం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అలాగే, ఈ బృందం సభ్యులకు రెండేసి కవర్లతో బహుమతుల ఎరవేశారు. అనంతరం.. ఏయూ నుంచి వెళ్లిపోయిన ఆ బృందం ఎన్‌బీఏకు నివేదికను సమర్పించే సమయంలో ఏయూ అధికారుల తీరును వెల్లడించింది. దీంతో వివరణ కోరుతూ ఏయూ పాలకవర్గానికి ఎన్‌బీఏ లేఖ రాసింది.
కవర్లలో పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయంట..!
ఎన్‌బీఏ లేఖపై ఏయూ అధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పత్రాల సమర్పణలో జాప్యానికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే కారణమని అందులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకాదని, బృందాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంకా ఏదైనా డాక్యుమెంట్లు అవసరమైతే వెంటనే సమరి్పంచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అలాగే, ఫ్యాకల్టీ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని తెలిపారు. బృందానికి ఇచి్చన ఆ రెండు కవర్లలో ఏయూకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, నోట్ ప్యాడ్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయని, దీనిని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు చింతిస్తున్నామని ఏయూ అధికారులు ఆ లేఖలో వివరణ ఇచ్చారు.
దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏయూ అభివృద్ధిలో దూసుకుపోయింది. నూతన ఆవిష్కరణలకు వేదికగా మారింది. సరికొత్త విభాగాలు, చైర్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లు ఇలా అనేక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. ఏయూ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా నాక్ ఏ++ గుర్తింపు లభించింది. అటువంటి ఆంధ్రా యూనివర్సివటీ ప్రస్తుతం రాజకీయ ప్రేరేపిత దాడులు, ప్రొఫెసర్లపై విచారణలకు పరిమితమైంది. దీంతో ఏయూ పూర్వవైభవం తగ్గుతూ వస్తోంది.
ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ బృందం ఏయూలో సందర్శించిన సమయంలో వారికి సరైన డాక్యుమెంట్లు అందించకపోవడం ఏయూలో అధికారుల పనితనానికి అద్దం పడుతోంది. మూడ్రోజుల పాటు ముల్యాంకనం జరిగితే.. కనీసం వారికి అవసరమైన సమాచారం అందించకపోవడం ఏయూలో చతికిలపడ్డ పరిపాలనకు నిదర్శనం. ఫలితంగా.. ఎన్‌బీఏ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచి్చంది. ఏయూ అధికారుల సుదీర్ఘ వివరణతో ఎన్‌బీఏ బృందం మరోసారి మూల్యాంకనానికి ఏయూను సందర్శించాలని నిర్ణయించింది.