గోదావరి 'ఉగ్రరూపం'

Polavaram project is likely to be flooded today with huge rains - Sakshi

తెలంగాణలో ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేత

నేడు పోలవరం ప్రాజెక్టుకు భారీవరద వచ్చే అవకాశం

శ్రీశైలంలోకి స్థిరంగా కృష్ణా ప్రవాహం

మహాబలేశ్వర్‌ పర్వతాల్లో విస్తారంగా వర్షాలు

నేడు కృష్ణా నదికి వరద పెరిగే అవకాశం

సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు పొంగి గోదావరికి వరద పెరిగింది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, కడెం జలాశయాల గేట్లన్నీ ఎత్తేసి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గంటగంటకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటిమట్టం 27.7 మీటర్లకు చేరింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువనుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పోలవరం వద్దకు నాలుగు లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 62,219 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మిగులుగా ఉన్న 63,608 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

నేడు ప్రకాశం బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు?
ఎగువ నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 21 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో శ్రీశైలం నీటిమట్టం పెరగడం లేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 846 అడుగుల్లో 72.05 టీఎంసీల నీరుంది. తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ పర్వతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమల్లో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలంలోకి మరో రెండు రోజుల్లో భారీవరద వచ్చే అవకాశం ఉందని అ«ధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 13 వేల క్యూసెక్కులు వస్తుండగా.. మూడువేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన పదివేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో మున్నేరు, కట్టలేరు నుంచి వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

గోదావరిలో వ్యక్తి గల్లంతు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన నెల్లూరి నగేష్‌ (50) అనే వ్యక్తి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎరువుల దుకాణం నడుపుకునే నగేష్‌ గురువారం నల్లజర్లలో రైతులకు ఎరువులు ఇచ్చేందుకు ఆటోలో వచ్చాడు. పని ముగిశాక అక్కడి నుంచి కొవ్వూరు చేరుకుని నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top