ఇంకెంత పెరగాలి బాబుగారూ? | Andhra Pradesh Records Highest Petrol And Diesel Prices In India Amid Fresh Fuel Hike, Check Out Rates Inside | Sakshi
Sakshi News home page

ఇంకెంత పెరగాలి బాబుగారూ?

May 19 2026 7:59 AM | Updated on May 19 2026 10:49 AM

Petrol and diesel prices are the highest in Andhra Pradesh

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్‌ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ98.63, డీజిల్‌ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్‌ రూ111.36(హైదరాబాద్‌), డీజిల్‌ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్‌ రూ.104.66, డీజిల్‌ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్‌ రూ.106.82, డీజిల్‌ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.48, డీజిల్‌ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.96, డీజిల్‌ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. 

ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్‌ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్‌ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్‌ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. 

ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్‌ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్‌ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్‌కు సూచిస్తున్నారు.

తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ: పెట్రోల్‌ ₹98.63, డీజిల్‌ ₹91.50

ముంబై: పెట్రోల్‌ ₹107.40, డీజిల్‌ ₹93.86

హైదరాబాద్‌: పెట్రోల్‌ ₹111.36, డీజిల్‌ ₹99.53

కోల్‌కతా: పెట్రోల్‌ ₹109.31, డీజిల్‌ ₹95.85

చెన్నై: పెట్రోల్‌ ₹104.66, డీజిల్‌ ₹96.22

బెంగళూరు: పెట్రోల్‌ ₹106.82, డీజిల్‌ ₹94.82

పాట్నా: పెట్రోల్‌ ₹109.40, డీజిల్‌ ₹95.61

జైపూర్‌: పెట్రోల్‌ ₹108.89, డీజిల్‌ ₹94.32

తిరువనంతపురం: పెట్రోల్‌ ₹111.24, డీజిల్‌ ₹100.09

చండీగఢ్‌: పెట్రోల్‌ ₹98.16, డీజిల్‌ ₹86.28

విజయవాడ (ఏపీ): పెట్రోల్‌ ₹114.48, డీజిల్‌ ₹102.17

విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్‌ ₹112.96, డీజిల్‌ ₹100.32
 

Advertisement
 
Advertisement
Advertisement