స్పెషల్‌ పికిల్స్‌: ‘‘ఊరగాయల ఊరు’’.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే

Peravalli Is Very Famous For Special Pickles - Sakshi

Pickle Village Usulumarru: ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నసమయంలో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం చేపట్టిన ఊరగాయల తయారీయే ఇప్పుడు ఆ ఊరికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి వారందరినీదర్జాగా బతికిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ రకరకాల ఊరగాయలు తయారు చేయడం ఆ ఊరి ప్రత్యేకత. అక్కడ తయారయ్యే పచ్చళ్లకు లేబుల్‌ లేకపోయినా.. బ్రాండ్‌ మాత్రం ఉంది. ఆ ఊరి పేరు ఉసులుమర్రు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన పెరవలి మండలంలోని గ్రామమది.  

పెరవలి: ఊరగాయల ఊరుగా ఉసులుమర్రు పేరొందింది. గ్రామ జనాభా 2,500 కాగా.. వారిలో 1,600 మంది పచ్చళ్ల తయారీ, విక్రయాలలో నిమగ్నమవుతుంటారు. ఏడాది పొడవునా ఏదో రకం ఊరగాయ తయారు చేస్తూ నిత్యం కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్ద.. ఆడ మగా అనే తేడా లేకుండా అందరూ ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. మగవాళ్లు దూరప్రాంతాలకు వెళ్లి ఊరగాయల వ్యాపారాలు చేస్తుంటే.. మహిళలు ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటూ ఊరగాయలు తయారు చేస్తుంటారు. సీజన్ల వారీగా ఆవకాయ, మాగాయ, టమాటా, ఉసిరి, అల్లం, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ, కాకర వంటి నిల్వ పచ్చళ్లు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కేవలం ఈ ఒక్క గ్రామం నుంచే సుమారు 300 మంది వ్యాపారులు పుట్టుకురాగా.. ఏటా 200 టన్నులకు పైగా ఊరగాయల ఉత్పత్తి అమ్మకాలు జరుగుతున్నాయి.  కిలో ఊరగాయ రూ.200–రూ.250కి విక్రయిస్తున్నారు.

అందరికీ అదే ఉపాధి 
ఉసులుమర్రు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామం. ఇక్కడ కేవలం వరి మాత్రమే పండిస్తారు. అందువల్ల ఏటా జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే వ్యవసాయ పనులుంటాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులకు బతుకుదెరువు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సుమారు 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పిళ్లా శ్రీరామమూర్తి కుటుంబం ఊరగాయలు తయారు చేసి ఊరూరా వెళ్లి విక్రయించడం ప్రారంభించారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఆయనే మరికొందరికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. అలా మొదలైన ఆ ఊరి ఊరగాయల ప్రస్థానం ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, అస్సాం, బెంగాల్‌ రాష్ట్రాల వరకు విస్తరించింది. ఊరగాయల తయారీతో గ్రామస్తులందరికీ ఇప్పుడు నిత్యం పని దొరుకుతోంది. మహిళలకు రోజుకు రూ.300, పురుషులకు రూ.400 చొప్పున కనీస కూలి లభిస్తోంది.  

ఆటుపోట్లు ఎన్నొచ్చినా.. 
ఈ వ్యాపారంలో తాము ఎన్ని ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదుర్కొన్నా కేవలం తామిచ్చే నాణ్యత మాత్రమే తమను నిలబెట్టిందని గ్రామస్తులు సగర్వంగా చెబుతుంటారు. ఇక్కడి వ్యాపారులు తెలంగాణలోని బోధన్, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ, 
తిరుపతి, ఒంగోలు, విశాఖ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి హోటళ్లు, పికిల్స్‌ షాపులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులంతా ఏడాదిలో 10 నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. కొందరు భార్యాబిడ్డలను వెంట తీసుకుని వెళతారు. మరికొందరు మాత్రం భార్యాబిడ్డలను గ్రామంలోనే 
ఉంచి సరుకు తయారు చేయించుకుంటారు. 

20 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం 
20 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారాన్ని నేటికీ కొనసాగిస్తున్నాం. ఏడాదిలో 10 నెలలు బయటి ప్రాంతాల్లోనే ఉంటాం. భార్యాబిడ్డలు ఇక్కడే ఉంటారు. ఈ వ్యాపారం వల్ల ఆస్తులైతే కూడగట్టలేం గానీ.. దర్జాగా బతకగలుగుతాం. 
– కొమ్మర వెంకటేశ్వరావు, వ్యాపారి

ఇదే మాకు బతుకునిస్తోంది 
పిల్లల భవిష్యత్‌ కోసం మా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఊరగాయల్ని విక్రయిస్తుంటే.. నేను ఊళ్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ పచ్చళ్లు తయారు చేసి పంపిస్తుంటా. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. వడ్డీకి తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటాం. 
    –  కూనపురెడ్డి సత్యవతి పచ్చడి వ్యాపారి ఉసులుమర్రు 

ఈ వ్యాపారం అంత సులభం కాదు 
ఈ వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర వ్యాపారాల మాదిరిగా పచ్చళ్ల వ్యాపారం చేయడం అంత సులభం కాదు. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధికారుల వేధింపులు ఎదురవుతాయి. తృణమో ఫణమో ముట్టజెప్పి ముందుకు వెళుతుంటాం. ఈ వ్యాపారానికి బ్యాంకుల సహకారం ఏమాత్రం లేదు. రుణాలిస్తే మరింత మెరుగ్గా వ్యాపారాలు చేస్తాం. పెట్టుబడి కోసం ప్రైవేట్‌ అప్పులు చేయాల్సి వస్తోంది. వచ్చిన లాభం వడ్డీకే సరిపోతోంది.  
– ముత్యాల రామాంజనేయులు, వ్యాపారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top