నోరు'ఊరు'

Peravali Village Famous For Pickles sales west godavari - Sakshi

ఉసులుమర్రు.. పచ్చళ్ల తయారీకి ప్రసిద్ధి

గ్రామంలో వందల మందికి ఉపాధి

సీజన్‌లో అన్ని రకాల పచ్చళ్ల తయారీ

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా

ఆ ఊరు పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. పచ్చళ్ల తయారీకి అంతగా ప్రసిద్ధి చెందింది జిల్లాలోని పెరవలి మండలం ఉసులుమర్రు. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ కొత్త పచ్చళ్ల తయారీ ఊపందుకుంటుంది. ఈ కాలంలోనే అన్ని రకాల పచ్చళ్లు పట్టి నిల్వ చేస్తారు. ఈ గ్రామంలో 2,400 మంది జనాభా ఉంటే పచ్చళ్ల తయారీపై 1,600 మంది ఆధారపడి జీవిస్తున్నారు.

 పెరవలి  : ఏడాది పొడవునా ఉసులుమర్రులో  పచ్చళ్ల అమ్మకాలు  సాగిస్తారు. టమాట, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ  వంటి పచ్చళ్లకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ తయారైన పచ్చళ్లను పట్టుకుని మగవారు హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు ప్రాంతాలకు అమ్మేందుకు బయలుదేరతారు. ఏడాదిలో 10 నెలలు వారు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. వేసవి రెండు నెలలు మాత్రమే వారు ఇళ్ల వద్ద ఉంటారు. ఈ సమయంలో ఏడాదికి సరిపడా పచ్చళ్లు పడతారు.

రుచిలో.. ఆవకాయదే అగ్రతాంబూలం
పచ్చళ్లలో ఎన్ని రకాలు ఉన్నా ఆవకాయ పచ్చడి రుచి వేరు. ఈ పచ్చడి పట్టడానికి నాణ్యమైన ముదురు మామిడి కాయలు కావాలి. టెంక పట్టి ఉండాలి. దీనిని సరి సమానంగా చిన్నచిన్న ముక్కలు కోసి అందులో జీడిని తీసి ఆరబెట్టాలి. ఆ తరువాత మెత్తగా కొట్టిన ఆవపిండి, నాణ్యమైన మెంతులు, ఎర్రటి పచ్చడి కారం, వేరుశెనగ నూనె లేక నువ్వుల నూనె కావాలి. ముందుగా కారం, ఆవపిండి, మెంతులు, మెత్తని ఉప్పు కలపాలి. ఆ తర్వాత మామిడి ముక్కలను నూనెలో ముంచి ఈ కారం కలిపిన మిశ్రమంలో వేసి ముక్కకు కారం పట్టేలా చూచి జాడీలో కానీ డ్రమ్ములో గానీ వేయాలి. ఇలా వేసిన తర్వాత నూనె వేసి మూత పెట్టాలి, మూడు రోజుల తరువాత పచ్చడిని కలపాలి. అన్ని పచ్చళ్ల కంటే పండుమిరప పచ్చడి పట్టడం ఎంతో ఇబ్బంది అని గ్రామస్తులు తెలిపారు. ఒక డ్రమ్‌ పచ్చడి తయారవ్వాలంటే రూ.10 వేల పెట్టుబడి అవసరమని చెప్పారు. గతంలో పండుమిరప పచ్చడిని రుబ్బేవారమని, కూలీలు ఈ పనికి రాకపోవడంతో ఇప్పుడు మెషీన్‌లోనే ఆడించి కలుపుతున్నట్టు తెలిపారు.

ధరలు మండిపోతున్నాయ్‌
గతంలో ఒక డ్రమ్ము పచ్చడికి రూ.10 వేలు సరిపోయేదని, నేడు రూ.20 వేలు అవుతోందని గ్రామంలోని తయారీదారులు చెప్పారు. నేడు మార్కెట్‌లో కిలో చింతపండు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ఉందని, అలాగే పండు మిరపకాయలు గతంలో కిలో రూ.50 ఉంటే నేడు రూ.100 ఉందని, మామిడి కాయలు టన్ను గతంలో రూ.6 వేలు ఉంటే నేడు రూ.10 వేలు అన్నా లేవన్నారు. ఆవాలు 50 కిలోల బస్తా గతంలో రూ.2 వేలు ఉంటే, నేడు రూ.2,500  అని, ఆయిల్‌ గతంలో కిలో రూ.70 ఉంటే నేడు రూ.100 ఉందని, వెళ్లుళ్లి పాయలు కిలో రూ.20  ఉంటే నేడు రూ.40 అని, మెంతులు కిలో రూ.40 ఉంటే నేడు రూ.60 అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల పచ్చళ్లు పట్టాలంటే రూ.రెండు లక్షల పెట్టుబడి అవసరం అని, కాలం కలసి వస్తే ఖర్చులు పోను రూ.40 వేల నుంచి రూ.50 వేలు మిగులుతుందని ఒక కుటుంబం వారు తెలిపారు. కేవలం నాణ్యతే తమ గ్రామ వ్యాపార సూత్రమని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top