అంబేడ్కర్‌ ఆశయాలకనుగుణంగా పాలన

Peedika Rajanna Dora Meruga Nagarjuna On CM Jagan Rule - Sakshi

మూడేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట 

‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్రను విజయవంతం చేయాలి 

ఈనెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమై 29న అనంతపురంలో ముగియనున్న యాత్ర 

డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలనుగుణంగా ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. దళితులంతా బానిసలు కాదు.. అంబేడ్కర్‌ వారసులని ఈ మూడేళ్ల పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారన్నారు. ఈ నెల 26న శ్రీకాకుళంతో ప్రారంభమయ్యే ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు.

విశాఖపట్నంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పాలన అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎంకు మద్దతుగా, ఈ ప్రభుత్వానికి అండగా చేపడుతున్న ఈ సామాజిక బస్సుయాత్రను జైత్రయాత్రగా సాగేలా అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాజన్నదొర మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలను చూసి యావత్‌ దేశం ప్రశంసలు కురిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాముఖ్యతను దావోస్‌ పర్యటనలో సీఎం వివరించనున్నారని తెలిపారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రెండురోజుల కిందట ఒక దళితుడు హత్యకు గురైతే దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా డీజీపీకి ఫోన్‌చేసి ఈహత్యలో నిందితులను శిక్షించాలని ఆదేశించారని గుర్తుచేశారు.

ఇది దళితులపై తమ నాయకుడికి ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అండతో గద్దెనెక్కిన చంద్రబాబు వారికి పూర్తిగా అన్యాయం చేశాడన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు, భావితరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు.  

బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నిరూపించిన సీఎం
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నిరూపించారని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి, వారి జీవనవిధానాలకనుగుణంగా, సామాజికంగా, రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు.

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా మాట్లాడుతూ చట్టసభల సభ్యులుగా, మంత్రులుగా పలువురు ముస్లింలకు వకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జాన్‌వెస్లీ,  కోలా గురువులు,  బొడ్డేడ ప్రసాద్,  పి.సుజాత, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌  రాజు,  మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top