తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్
దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర
‘సర్’తో 30 % ఓట్లు తగ్గిపోయే ప్రమాదం
రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
బ్యాలెట్ ఓటింగే ఉత్తమం: రైతు ఉద్యమ నేత వడ్డే
తిరుపతి అర్బన్: ‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకన్ల సమయం పడుతుంది. కానీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 3 సెకన్లకు ఒక ఓటు చొప్పున వేయడం ఎలా సాధ్యమైంది’ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం ‘భారత రాజ్యాంగం.. సవాళ్లు’ పేరిట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. పరకాల మాట్లాడుతూ.. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం స్వారీ చేస్తోందని.. దానినుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదన్నారు. కొత్తగా ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. దేశంలో 30 శాతం ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి ఓటు హక్కు తీసివేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలో ఓట్లు ఉన్నవారు, ఓట్లు లేనివారు అనే రెండు వర్గాలు మాత్రమే మిగులుతాయన్నారు.
బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి
రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ద్వారా లక్షల ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. సాంకేతికతలో మనదేశం కంటే ముందున్న దేశాల్లో సైతం బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఓ యువ నాయకుడు స్మార్ట్ మీటర్లు పెడితే రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆయనే స్మార్ట్ మీటర్లను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఏజెంట్‌గా మారింది
మాజీ ఎమ్మెల్సీ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా మారిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ రిటైరయ్యే ముందు బీజేపీకి అనుకూలంగా 10 తీర్పులు ఇచ్చారని, అనంతరం బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. విభజన హామీలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, అయితే బడా నేతలు మాత్రం రుణాల పేరుతో బ్యాంకులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మన గ్యాస్‌ను స్థానికంగా ఇవ్వకుండా గుజరాత్‌కు తరలించడం దుర్మార్గమన్నారు.
సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు దుర్మార్గం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిని చొరబాటుదారులుగా ముద్ర వేయడాన్ని తప్పుపట్టారు. రాజ్యాంగ వ్యవస్థల్ని రద్దుచేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. వ్యవస్థల్లో తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మనుషులపై మారణహోమం సృష్టించే మిలిటరీ ఇండ్రస్టియల్ హబ్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నిజానికి సంకెళ్లు వేసే వ్యవస్థ నడుస్తోందని, దీనిపై ప్రతి పౌరుడు చైతన్యవంతుడు కావాలని పేర్కొన్నారు. తప్పులను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని, దాని మూలాలను చంద్రబాబు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు పి.అంజయ్య, సీపీఐ రాష్ట్ర నేత హరినాథ్‌రెడ్డి, వామపక్ష నేతలు కందారపు మురళి, వందాసి నాగరాజు, మురళి, సాయిలక్ష్మి, జయచంద్ర మాట్లాడారు.


