
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జూలో ఇండియన్ తోడేలు, బెంగాల్ నక్క, మడగాస్కర్ ప్రాంతానికి చెందిన లెమూర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ఈ మూడు పిల్లలు జూ వైద్యులు, సిబ్బంది సంరక్షణలో ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ వెల్లడించారు.
అంతరించిపోతున్న జాబితాలో ఉన్న తోడేళ్లు జూలో సంతానోత్పత్తి చేయడం శుభసూచికమని క్యూరేటర్ పేర్కొన్నారు. కాగా, ఇక్కడ సంతానోత్పత్తి చేసిన తోడేళ్లను 2019లో మైసూరు జూ పార్కు నుంచి, బెంగాల్ నక్కలను 2021లో ఢిల్లీ జూ నుంచి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక లెమూర్లను సుమారు పదేళ్ల కిందట ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం జూలో ఈ కొత్త పిల్లలతో కలిపి మొత్తం 8 ఇండియన్ తోడేళ్లు, 15 రింగ్‌టైల్డ్ లెమూర్స్, 4 బెంగాల్ నక్కలు ఉన్నాయని క్యూరేటర్ తెలిపారు.