‘బిగ్‌బాస్’ కనుసన్నల్లో ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ
త్వరలో కాలేజీ ముఖ్య నేత కుటుంబపరమయ్యే అవకాశం
రూ.2 వేల కోట్ల విలువైన కాలేజీ కారుచౌకగా సొంతం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ‘ముఖ్య’నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలో అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు కదిపారు. బుధవారం జరిగిన కమిటీ ఎన్నికల్లో అంతా ముఖ్యనేత అనుకున్నట్లే జరిగింది. కాలేజీని ముఖ్యనేత పరం చేసేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్య నేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కమిటీ కోసం ముఖ్య నేత మనుషులు 20 రోజులుగా ‘ప్రత్యేక ఆపరేషన్’ నిర్వహించారు. పాత డైరెక్టర్లలో ఒక వర్గాన్ని గతంలోనే లొంగదీసుకోగా మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. బెదిరింపులతోపాటు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది. రాజధాని పనులు పర్యవేక్షించే మంత్రి ఈ వ్యవహారంలో అన్నీ తానై వ్యవహరించారు.
ముఖ్య నేత ప్రాపకం కోసం..
ముఖ్యనేత బినామీగా పేరు పొందిన ఓ పారిశ్రామికవేత్త, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ మొదట అన్ని విషయాలు పర్యవేక్షించి పాత డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్య నేత అభీష్టాన్ని తెలుసుకున్నాక మంత్రి కూడా రంగంలోకి దిగారు. ముఖ్య నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి నయాన భయాన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యనేతకు అనుకూలంగా వ్యవహరించే మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది. ఇక ఈ కమిటీ ద్వారా కాలేజీని ముఖ్యనేత తమ కుటుంబం పరం చేసుకోవడమే మిగిలింది. అత్యంత కారుచౌకగా కాలేజీ, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పాత డైరెక్టర్లు చర్చించుకుంటున్నారు.
రూ.2 వేల కోట్ల ఆస్తి.. పప్పు బెల్లాలకు!
కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ఈ ప్రాంతానికి చెందిన 32 మంది ఎన్‌ఆర్‌ఐ వైద్యులు ఎన్‌ఆర్‌ఐ మెడికల్ సైన్సెస్‌ను స్థాపించారు. మంగళగిరిలో 50 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రిని నిర్మించారు. అనతి కాలంలోనూ అది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందగా దాని విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలేజీ విలువ రూ.2 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. మేనేజింగ్ కమిటీలో తలెత్తిన విభేదాలతో దీనిపై ముఖ్య నేత కన్ను పడింది. వీటిని ఆసరాగా తీసుకుని ఏకంగా కాలేజీనే సొంతం చేసుకునే ఎత్తుగడ వేశారు. ఇందుకోసం తన బినామీలను రంగంలోకి దించి డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కమిటీ ఏర్పాటయ్యేలా కుట్రలు పన్నారు. కాలేజీని కారుచౌకగా ముఖ్యనేత కుటుంబ పరం చేసేలా పావులు కదిపారు. కాలేజీకి చెందిన రూ.240 కోట్ల కార్పస్ ఫండ్‌తోపాటు ఇతర విలువైన ఆస్తులను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.


