ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్‌ 

NIA Searches In 31 Areas In Telugu States - Sakshi

మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ ఎన్‌ఐఏ అభియోగం

ఆధారాలకోసం ఏపీ, తెలంగాణల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు

రూ.10 లక్షల నగదు, 40 మొబైల్‌ ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, పలు పరికరాలు స్వాధీనం

ఎన్‌ఐఏ సోదాలపై ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాల నిరసన  

సాక్షి,అమరావతి/ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ)/వజ్రపుకొత్తూరు రూరల్‌/టంగుటూరు: విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పాంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గత నవంబర్‌ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ పాంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడంతోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంçఘాల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌర హక్కుల నేతల ఇళ్లల్లో బుధ, గురువారాల్లో ఎన్‌ఐఏ సుదీర్ఘంగా సోదాలు నిర్వహించింది. ఆరుగురిని అరెస్టు చేసినట్టు మీడియాకు గురువారం తెలిపింది.

విస్తృతంగా సోదాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్‌ జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. సోదాల్లో దొరికిన పలు ఆధారాలతో పాంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వరరావు, మునుకొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పూడి అంజమ్మలను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

సోదాల్లో రూ.10 లక్షల నగదు, 40 మొబైల్‌ ఫోన్లు, 44 సెల్‌ఫోన్‌ సిమ్‌లు, 70 స్టోరేజ్‌ డివైజెస్‌(హార్డ్‌డిస్క్‌లు), మైక్రో ఎస్‌డీ కార్డులు, ఫ్లాష్‌ కార్డులు, 184 సీడీలు, డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్లు, సీపీఐ మావోయిస్టు జెండాలు, మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం, లేఖలు, పత్రాలు, ప్రెస్‌నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. 

సోదాలపై నిరసన.. 
పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్‌ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముంచంగిపుట్టు సంఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 32 మందిపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని, అందులో భాగంగానే  సోదాలు జరిపి విచారించారని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన ప్రజాసంఘ నాయకురాలు పోతనపల్లి అరుణ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు విమర్శించారు. 

ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా?
ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్‌కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం రాత్రి, గురువారం సోదాలు చేసిన ఎన్‌ఐఏ అధికారులు పెన్‌డ్రైవ్, 5 పుస్తకాలు తీసుకెళ్లారన్నారు. ఎన్‌ఐఏ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారని తెలిపారు. ఇదేనా మాకిచ్చే భరోసా.. ఇక్కడి కంటే అడవుల్లో ఉండటం మంచిదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట విరసం నేత కళ్యాణరావు తదితరులు ఉన్నారు. 
చదవండి:
మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్‌
వాలంటీర్లకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top