‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట

National Highway 544D: Four Lanes Road From Anantapur to Guntur Soon - Sakshi

418 కిలోమీటర్లు.. రూ.9 వేల కోట్లు

అనంతపురం నుంచి గుంటూరుకు 4 లేన్ల రహదారి

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

సాక్షి, అమరావతి: రాయలసీమను శాసన రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ రాచబాట రూపొందనుంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 417.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్‌ 544డి’ నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదం తెలిపింది.

ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయం 
అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం ఎన్‌హెచ్‌ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉంది. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములను అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు  కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రాయలసీమ నుంచి శాసన రాజధాని అమరావతికి సరైన రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమను అమరావతితో అనుసంధానించే రహదారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.

ఈ అంశంపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం – అమరావతి అనుసంధానానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం – గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544డి నిర్మాణానికి ఆమోదించింది. 

4 ప్యాకేజీల కింద నిర్మాణం
417.91 కిలోమీటర్ల ఈ రహదారిని రూ.9 వేల కోట్లతో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని నిర్ణయించారు.

1. అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బుగ్గ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. అందుకోసం రూ.2,130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు.

2. బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందిస్తున్నారు. 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.4,550 కోట్లతో నిర్మిస్తారు.

3. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు పేవర్డ్‌ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే వేగంగా కొనసాగిస్తున్నారు. 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం రూ.845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. అందులో 108.37 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత  డిసెంబరు 25నే పీసీసీ జారీచేశారు. 

4. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం రూ.1,475 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు.

రాయలసీమ నుంచి అమరావతికి మెరుగైన కనెక్టివిటీ
అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంతో రాయలసీమతో అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ వ్యయ, ప్రయాసలతో మెరుగైన ప్రయాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదించింది. డీపీఆర్‌ పూర్తయిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మిస్తుంది.
– ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top